- చంద్రబాబు, పవన్‌కు థ్యాంక్స్: ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించకుండా పాలకులు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
అగ్రకులాలకు ఒకే రోజులో ఆగమేఘాల మీద 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారని, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మూడు దశాబ్దాలకు పైగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ మాదిరిగా ఏపీలోని హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని, కేంద్ర బడ్జెట్ లో బీసీలకు రూ.2 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు.
జనగణనలో బీసీ కులగణన లెక్కలు తీయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే డిసెంబర్ లో ‘చలో ఢిల్లీ’ పేరుతో పార్లమెంట్ ఎదట భారీ నిరసన ప్రదర్శన చేపడతామని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు వై.నాగేశ్వరరావు, నుకాలమ్మ, గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, వరప్రసాద్,ప్రసన్న, గురుమూర్తి, చక్రధర్, లక్ష్మణ్ రావు, మధుకర్, సీహెచ్ శ్రీనివాస్, లీలా తదితరులు పాల్గొన్నారు.