- 10 నెలల్లో పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. గడిచిన పది నెలల్లో ప్రభుత్వానికి లక్షా ఎనభై వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో16 వేల కోట్లు రైతు బంధుకు, ఉద్యోగుల జీతాలకు కేటాయించారని, మిగిలిని మొత్తం దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నులు, గ్రాంట్ల ద్వారా లక్ష కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 80 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, అయినప్పటికీ స్టూడెంట్లకు ఫీజు బకాయిలు చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెనకాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గురువారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
మూసీ బ్యూటిఫికేషన్అవసరం ఏముందని, ఆ ప్రాజెక్టుకు రూ.లక్ష యాభై వేల కోట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మంత్రులు, అధికారులు స్టడీ టూర్ల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించలేని, స్కాలర్షిప్ లను పెంచలేని, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించలేని దుస్థితిలో ఉందన్నారు. నవంబర్ మొదటి వారంలో బీసీలను జాగృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.