హైదరాబాద్: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇ్వవకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు.
ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలన్నారు. బీసీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించాలని బీసీ ఉపాధ్యాయులు, విద్యార్థులనునుంచి వత్తిడి వస్తోందన్నారు.
ప్రజాస్వామ్యంలో అన్ని కులాలలకు జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు తప్పా సీట్లు ఇవ్వడంలేదన్నారు. బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వారినే బీసీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించుకుంటారని హెచ్చరించారు.
బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను బొందపెడతామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నాం.. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు.