విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి : బీసీ నేత ఆర్.కృష్ణయ్య

విద్యార్థుల  ఫీజు బకాయిలు విడుదల చేయాలి : బీసీ నేత ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా కేవలం రూ.1,525 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.3వేల కోట్లు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బుధవారం కాచిగూడలో బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది.

కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రూ.1,500 కోట్లతో విద్యార్థుల సమస్య పరిష్కారం కాదన్నారు. మొత్తం బకాయిలు ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా, ప్రజాపాలన పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం కరెక్ట్​కాదని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ నేతలు నీల వెంకటేశ్, నంద గోపాల్, కీర్తిలత గౌడ్, అంజి, ప్రణీత, జనార్ధన్, మల్లేష్, రిషి, సాయికిరణ్, ప్రభాకర్, హరితిలక్ సింగ్ పాల్గొన్నారు.