- నామినేటెడ్ పోస్టులు 50 శాతం బీసీలకే ఇవ్వాలి
- బీసీ సంఘాల సమావేశంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: త్వరలో చేయబోయే మంత్రివర్గ విస్తరణలో నలుగురు బీసీలకు అవకాశం ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ నేత గుజ్జ కృష్ణ నేతృతంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది.
ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలు ఇద్దరే ఉన్నారని, అవి కూడా ప్రాధాన్యత లేని శాఖలని విమర్శించారు. కాంగ్రెస్ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసినా, నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు.
జనాభా ప్రకారం ప్రతి సామాజిక వర్గానికి వాటా ఇవ్వాలన్నారు. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని చైర్మన్, డైరెక్టర్ పోస్టులను 50 శాతం బీసీలకు కేటాయించాలని కోరారు. 76 ఏండ్లుగా బీసీల సముచిత వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేటికీ పాలకులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. గత ఎన్నికల్లో బీసీల మద్దతుతోనే కాంగ్రెస్అధికారంలోకి వచ్చిందని, గెలిచాక బీసీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
కార్పొరేషన్ చైర్మన్ల పదవులను బీసీలను అతి తక్కువగా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలోని బలమైన బీసీ నాయకులను గుర్తించాలని కోరారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సముచిత స్థానం కల్పించకపోతే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేశ్, నందగోపాల్, అనంతయ్య, సతీశ్, రాజేందర్, నిఖిల్, రవి, బాలస్వామి, మణికంట, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.