హైదరాబాద్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు చివరి ఎన్నికలుగా అనిపిస్తోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య. ఒక్క బీసీ నాయకుడు అయినా రాజకీయంగా ఎదిగారా...? అగ్ర కులాల్లో మాత్రం కొందరు నాయకులు కోట్లకు పడగలెత్తారని అన్నారు. సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యపై ఒక్కరోజే 90 కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. జానయ్య వెంట 90 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకొకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు ఆర్.కృష్ణయ్య. ఓటు బ్యాంకు కేంద్రంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ.. ఎంఆర్పీఎస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్యర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత బహుజనుల బిడ్డలపై మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు, అణిచివేతలను ఖండిద్దాం.. సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి తప్ప బీసీ నాయకుడు జానయ్య యాదవ్ పోటీ చేయకూడదా..? అని నాయకులు ప్రశ్నించారు.
వట్టే జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కోపం తగ్గే అవకాశం ఉందన్నారు. ఒకవేళ కేసులు ఎత్తి వేయకపోతే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల తరపున తాను అండగా ఉండేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వట్టే జానయ్య చెప్పడం అభినందనీయం అన్నారు. జానయ్య రాజకీయంగా ఎదగనీయకుండా ఆయనపై మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గెలుపు కోసం వట్టే జానయ్య ఎంతో కృషి చేశారని చెప్పారు మందకృష్ణ మాదిగ. రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా జానయ్య పోటీ చేస్తానని చెప్పినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వెలుగు పత్రిక ముందుగానే రాసిందని, సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పిన రెండు రోజులకే వట్టే జానయ్యపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచిన రోజుల్లోనూ ఏ ఒక్కరిపై 90 కేసులు పెట్టలేదన్నారు. కానీ.. ఇప్పుడు ఎలా పెడుతారని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ నుండి వట్టే జానయ్యకు టికెట్ ఇస్తే జగదీష్ రెడ్డి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందన్నారు. వట్టే జానయ్య యాదవ్ కు తమ మద్దతు ఉంటుందన్నారు.