
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో తప్పులు చేశారని, పరీక్షా కేంద్రాల కేటాయింపుపై అనేక అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, జనార్దన్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రూప్–1అభ్యర్థులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. గ్రూప్–1 అవకతవకలకు బాధ్యులైన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకే సెంటర్లో పక్కపక్కన కూర్చొని ఎగ్జామ్రాసిన అభ్యర్థులు ఎంపికవ్వడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. పూర్తి బయోమెట్రిక్, సీసీ కెమెరా పర్యవేక్షణలో మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ గ్రూప్–1 తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ల వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని, తెలుగు ఏ మాత్రం రానివారు పేపర్లు కరక్షన్ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ29 రద్దు చేసి పాత 55 జీఓ ప్రకారం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.