
వాటిని కొనడానికి ఎవరొచ్చినా అడుగు పెట్టనీయం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ప్రభుత్వ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు విద్యను అందించేలా యూనివర్సిటీలు ఉండాలన్నారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో విద్యార్థులకు అనుగుణంగా యూనివర్సిటీలో భవనాలు ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు వందల ఎకరాలు వర్సిటీలకు కేటాయించారని గుర్తుచేశారు. విద్యార్థులకు కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నప్పుడు భూమి ఉంటేనే కొత్త బిల్డింగులు కట్టొచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. సర్కార్ భూములను అమ్మడం సమంజసం కాదన్నారు. ఎవరైన వర్సిటీ భూములను కొనడానికి వస్తే వారిని అక్కడ అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. గత 75 ఏండ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకుల విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించలేదని విమర్శించారు.ప్రభుత్వ స్థలాలు అమ్మితే భావితరాలకు ఏమి మిగలదని, కనీసం విద్య కూడా అందకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత, నంద గోపాల్, కోలా జనార్దన్, అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ యాదవ్, శివకుమార్, అవినేశ్, ఉదయ్ నేత, మణికంఠ, బాలస్వామి, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.