బషీర్ బాగ్/మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి మూసీ బ్యూటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల భవిష్యత్‌పై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మూసీ ప్రాజెక్టుకు రూ.2 లక్షల 50 వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం దగ్గర స్టూడెంట్ల ఫీజు బకాయిలు చెల్లించేందుకు రూ.4 వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు.
బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం బర్కత్ పురాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యజమాన్యాలు స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ మెహిదీపట్నంలోనూ భారీ ర్యాలీ నిర్వహించారు.