అందుకే MP పదవికి రాజీనామా చేశా.. అసలు విషయం బయటపెట్టిన కృష్ణయ్య

అందుకే MP పదవికి రాజీనామా చేశా.. అసలు విషయం బయటపెట్టిన కృష్ణయ్య

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై కృష్ణయ్య స్పందించారు. ఇవాళ (సెప్టెంబర్ 24) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ఇంకా నాలుగేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవధి ఉన్నప్పటికీ.. బీసీల సమస్యలపై పోరాటం చేసేందుకే పదవికి రిజైన్ చేశానని క్లారిటీ ఇచ్చారు. 

స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నానని.. ఈ క్రమంలో తన ఉద్యమానికి రాజకీయ కోణం దిద్దెందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అందుకే వైసీసీకి ఆ పార్టీ ద్వారా దక్కిన ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు. ఇకపై రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

ALSO READ | వైసీపీకి ఊహించని దెబ్బ.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా

 బీసీల కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టాలని చాలా మంది కోరుతున్నారని.. దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి  బీసీల సమస్యలపై కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. తన రాజీనామాను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెప్పానన్నారు. తనపై నమ్మకంతో తనకు ఎంపీగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు.