బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య

బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
  •     చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి
  •     రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు :  జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలు.. అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. వాటా దక్కేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్ లో ఓయూ ఉద్యమ జేఏసీ నాయకుడు ఏనుగంటి రాజు నేత ఆధ్వర్యంలో 16 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, సామాజిక వివక్షను రూపుమాపలేకపోతున్నారని విమర్శించారు. 

జనాభా ప్రకారం అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన వాటాను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీజేపీ మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించి ఒక్క అంశాన్ని కూడా పేర్కొనకపోవడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ స్పందించి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు డిమాండ్ చేశారు.  ఏనుగంటి రాజు నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ బీసీలకు జాతీయస్థాయిలో ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్షిప్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో అనంతయ్య, జిల్లపల్లి అంజి, పి.సుధాకర్, దొడ్డిపల్లి రఘుపతి, రాజ్ కుమార్, మధు, మహేశ్, రాహుల్, చైతన్య, రాము, విక్రమ్, జగన్, తేజ, బాలయ్య, మనోహర్, చాణుక్య, రమేశ్, సాయి, గణేశ్, అశోక్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.