బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తా: ఆర్ కృష్ణయ్య

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తా: ఆర్ కృష్ణయ్య

 

ముషీరాబాద్, వెలుగు: బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి.. న్యాయమైన హక్కులను సాధించడమే తన లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. బుధవారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలకు  న్యాయం జరిగే వరకు వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేయడమే తమ విధానమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని,76 ఏండ్ల తర్వాత కూడా చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. జగన్ తనను ఎంపీగా రాజ్యసభకు నామినేట్ చేసినా.. అక్కడ బీసీల కోసం ప్రశ్నిస్తే సమాధానం రాలేదన్నారు. రాజ్యసభ పదవీకాలం ఇంకా నాలుగేండ్లు ఉందని.. అయినా హక్కుల సాధనకు ప్రజా ఉద్యమమే శరణ్యమని, భవిష్యత్ కార్యాచరణ కోసమే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. రాజ్యాధికారంలో వాటా అంటే చట్టసభల్లో బీసీలకు 50% ఇవ్వాలని.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులకు 21 సీట్లే ఇచ్చారని గుర్తుచేశారు. చట్టసభల్లో 50% వాటా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే నిర్ణయమేది తీసుకోలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. 

కాంగ్రెస్​లోకి రండి: మల్లు రవి 

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బుధవారం ఆర్.కృష్ణయను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కృష్ణయ్యతో భేటీ అయ్యారు. బలహీన వర్గాల సంక్షేమం, రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతిస్తామని, కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కోరారు. రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య మద్దతుగా పెద్ద సంఖ్యలో బీసీలు, బీసీ కుల సంఘాలు తరలివచ్చి మద్దతు తెలిపాయి.