
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య . అలాగే 61 ఏళ్ళు నిండిన వీఆర్ఎల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర వీఆర్ఎల జేఏసీ తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యాలయంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ తో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... జీవో నంబర్ 81 ప్రకారం 61 ఏండ్లు పైబడిన వీఆర్ఎల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు.
న్యాయబద్ధంగా 3,797 మంది వారసులు ఉద్యోగాలకు అర్హులని , ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెల్లకపోవడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు. వీరికి ఉద్యోగాలు ఇస్తే , రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు , నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని ఆర్ కృష్ణయ్య కోరారు.