మెస్​చార్జీలు పెంచకపోతే సెక్రటేరియట్​ను ముట్టడిస్తం: ఆర్ కృష్ణయ్య

మెస్​చార్జీలు పెంచకపోతే సెక్రటేరియట్​ను ముట్టడిస్తం: ఆర్ కృష్ణయ్య
  • మెస్​చార్జీలు పెంచకపోతే సెక్రటేరియట్​ను ముట్టడిస్తం
  • రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
  • స్టూడెంట్లతో కలిసి తెలుగు సంక్షేమ భవన్ వద్ద ఆందోళన 

మెహిదీపట్నం, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్​చేశారు. 16 లక్షల మంది స్టూడెంట్లకు స్కాలర్​షిప్ చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో సెక్రటేరియట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాము సీఎం, మంత్రి, ఎమ్మెల్యే పదవులు అడుగతలేమని, కేవలం స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. 

శనివారం వందలాది మంది స్టూడెంట్లతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని తెలుగు సంక్షేమ భవన్ ను ముట్టడించారు. ‘మెస్ చార్జీలు పెంచాలి. స్కాలర్ షిప్ లు చెల్లించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. నిత్యవసర ధరలు పెరగడంతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ‘మెనూ’ పాటించడం లేదని ఆరోపించారు. గుడ్లు, పండ్లను తగ్గించి ఇస్తున్నారని చెప్పారు. స్టూడెంట్లకు పూటకు రూ.10 చెల్లిస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మెస్​చార్జీలను డబుల్​చేయాలని డిమాండ్​చేశారు. అలాగే స్కాలర్​షిప్​లను మంజూరు చేయాలని, కొత్తగా 300 కాలేజీ హాస్టళ్లు ప్రారంభించాలని కోరారు. బీసీ నాయకులు నీల వెంకటేశ్, మల్లేశ్, వీరన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.