- చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతా
హైదరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అన్నారు. బీజేపీ పిలిచి రాజ్యసభ అవకాశం ఇచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని తెలిపారు. బీసీల కోసమే పోరాటం చేస్తానని చెప్పారు. 50 ఏండ్లు బీసీల కోసం పోరాటం చేశానని చెప్పారు.
వైసీపీలో మాట్లాడే అవకాశం తక్కువ అని.. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మారానని తెలిపారు. బీజేపీ తనకు కొత్త కాదని.. తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీయే అన్నారు. అన్ని పార్టీలు బీసీల కోసం న్యాయం చేస్తున్నాయని చెప్పారు. తాను పార్టీల కండువాలు వేసుకోలేదని పార్టీలే తన దగ్గరకు వచ్చాయని తెలిపారు. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్... బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య ఎంపికయ్యారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది.