హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తన సత్తా చాటాడు. జాతీయ స్థాయి స్విమ్మర్ గా పేరొందిన వేదాంత్.. తాజాగా మరో 7 పతకాలను సొంతం చేసుకున్నాడు. వేదాంత్ సాధించిన ఘనతకు తండ్రి మాధవన్ ఆనందంతో పొంగిపోతున్నాడు. తాజాగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో వేదాంత్ 5 స్వర్ణాలు, 2 రజతాలు సహా 7 పతకాలు కొల్లగొట్టాడు. ఈ సందర్భంగా తండ్రి మాధవన్ తన కుమారుడి విజయాలను అభినందిస్తూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వేదాంత్ ప్రదర్శనకు చాలా గర్వంగా ఉందని.. దేవుని దయతో 100మీ, 200మీ, 1500 మీటర్లలో స్వర్ణం.. 400 మీటర్లు, 800 మీటర్లలో రజతం సాధించాడని మాధవన్ ట్వీట్ చేశారు.
వేదాంత్ గత కొన్నేళ్లుగా స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాడు. స్విమ్మింగ్‌లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వేదాంత్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇక కొడుకు లక్ష్యాన్ని తెలుసుకున్న మాధవన్ దంపతులు అతడిని ఒలంపిక్స్ కోసం సన్నద్ధం చేస్తున్నారు. అలాగే ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్ర జట్టుకు మాధవన్ అభినందనలు తెలిపారు. ఆ జట్టు మొత్తం 161 పతకాలు సాధించింది. వీటిలో 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలు ఉన్నాయి.