వరల్డ్ ఛాంపియన్‎నే ఓడించాడు: టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద్

వరల్డ్ ఛాంపియన్‎నే ఓడించాడు: టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద్

టాటా స్టీల్ మాస్టర్స్ 2025 చెస్ టోర్నీ టైటిల్ విజేతగా భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ నిలిచాడు. ఆదివారం (ఫిబ్రవరి 2) నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద టైటిల్ కైవసం చేసుకున్నాడు. విజయం కోసం ఈ ఇద్దరు యువ భారత ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. చివరకు టై బ్రేకర్‎లో ప్రజ్ఞానంద్ విజయం సాధించాడు. దీంతో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద్ చరిత్ర సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్  2006లో టాటా స్టీల్ మాస్టర్స్ గెలిచారు. మళ్లీ 19 సంవత్సరాల తర్వాత టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీని ప్రజ్ఞానంద్ నెగ్గాడు.

మొత్తం 14 మంది ఆటగాళ్ల రౌండ్ రాబిన్ ఈవెంట్‌లో పాల్గొనగా ప్రజ్ఞానంద్, గుకేష్ చివరి పోరుకు అర్హత సాధించారు. ప్రపంచ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‎సన్ వంటి ఆటగాళ్లను వెనక్కి నెట్టి భారత యంగ్ ప్లేయర్స్ ఫైనల్‎కు చేరుకున్నారు. ఫైనల్ పోరులో విజయం కోసం ఇద్దరు యువ ఆటగాళ్లు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఒకరికి మించి మరొకరు పై ఎత్తులు వేసి ఫైనల్ పోరును ఉత్కంఠభరితంగా మార్చేశారు. 

చివరకు వరల్డ్ చాంపియన్ గుకేష్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన ప్రజ్ఞానంద్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడి.. టాటా స్టీల్ మాస్టర్స్ 2025 చెస్ టోర్నీ టైటిల్ విజేతగా నిలిచాడు. టాటా టోర్నీల్లో అత్యుత్తమ టైటిల్ గెల్చిన ప్రజ్ఞానంద్‎కు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 విశ్వ విజేతగా భారత గ్రాండ్‌ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు ఈ యువ భారత గ్రాండ్ మాస్టర్. ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా నిల్చిన కొన్ని రోజులకే గుకేష్ టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ఓటమి పాలు కావడం గమనార్హం.