2027 వన్డే ప్రపంచకప్‌.. టీమిండియా కెప్టెన్‌గా గిల్: భారత మాజీ కోచ్ జోస్యం

2027 వన్డే ప్రపంచకప్‌.. టీమిండియా కెప్టెన్‌గా గిల్: భారత మాజీ కోచ్ జోస్యం

కొన్నేళ్లుగా భారత జట్టుకు చాలామంది కెప్టెన్లు మారారు. ప్రధాన కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు అరడజను భారత జట్టుకు నాయకత్వం వహించారు. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శుభమాన్ గిల్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో రెండు, మూడేళ్ళలో వన్డే, టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం ఖాయం.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో మూడు ఫార్మాట్లలో భారత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తాడని భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. "ప్రస్తుతం గిల్ టీ20, వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలకు డిప్యూటీగా పనిచేస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ నుంచి గిల్ పగ్గాలు చేపట్టి భారత్‌కు నాయకత్వం వహిస్తాడు".  అని శ్రీధర్ జోస్యం చెప్పాడు. నాకు శుభ్‌మన్ గిల్ ఆల్-ఫార్మాట్ ఆటగాడని.. 2027 ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత్ కు కెప్టెన్సీ చేస్తాడని నేను   ఖచ్చితంగా అనుకుంటున్నానని శ్రీధర్ హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పుకొచ్చారు.   

 రెండేళ్ల నుంచి గిల్ తన బ్యాటింగ్ తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. దీంతో అతన్ని ఇటీవలే ముగిసిన జింబాబ్వే టూర్ కు యువ భారత జట్టుకు కెప్టెన్ గా ప్రకటించారు. ఈ సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఇక తాజాగా శ్రీలంకతో జరగబోయే సిరీస్ కు గిల్ ను టీ20, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. వన్డేల్లో రోహిత్.. టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.