తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ఆర్ విద్యాసాగర్ రావు

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన నీటి వాటాను బొట్టు బొట్టు లెక్కగట్టి నిజాలను బయటపెట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన సాగునీటి రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు.  ఆయన నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారుగా నియమితులయ్యారు. విద్యాసాగ‌ర్‌రావు చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. నీళ్లే ఆయన ఇంటిపేరుగా మారింది. వృత్తిరీత్యా ఇంజనీరు అయినా కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా కూడా పేరొందారు. ఆయనది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. తల్లి ల‌క్ష్మమ్మ, తండ్రి రాఘ‌వ‌రావు. వారిది విద్యావంతుల కుటుంబం‌.  తెలంగాణ ఉద్యమంలో నీళ్ల లెక్కలతో చైతన్యం చేసిన నిపుణుడిగా విద్యాసాగర్ రావును స్మరించుకోవడం మన బాధ్యత. ప్రాజెక్టులు నిర్మించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. సమైక్య పాలనలో నీటి పారుదల రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించి చైతన్యం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. 

కేంద్ర జలసంఘంలో పనిచేసిన అనుభవం

ఢిల్లీలో ఉన్న సమయంలో సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించారు. ఉద్యోగం నుంచి విశ్రాంతి పొందాక, హైదరాబాద్ కు వచ్చారు. దాదాపు 34 ఏండ్ల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయన దేశ వ్యాప్తంగా జలవనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల విషయాలపై లోతైన, సమగ్ర అవగాహన ఆయనకు ఉండేది. నీళ్ల గురించి నిజాలను మనకు తెలియజెప్పిన నీటి పారుదల నిపుణులు, జీవితపు చివరి క్షణం వరకు తెలంగాణ బాగు కోసం తపించిన మహామనీషి  మన ‘వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ' గా పేరుగాంచిన విద్యాసాగర్​రావు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులపై అగ్రగామి నిపుణుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన అనేక పత్రికలలో జల సంబంధిత సమస్యలపై సుమారు100 వ్యాసాలు రాశారు. ‘నీళ్లు నిజాలు’ అనే పేరుతో రెండు సంపుటాలను వెలువరించారు. విద్యార్థులు, మేధావులు, సాధారణ ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆయన సెమినార్లు నిర్వహించేవారు. ఆయన జయంతి నవంబర్​ 14న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటి -నీటిపారుదల సౌకర్యాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టారు. ఆయన లాంటి గొప్ప తెలంగాణ వాది స్వరాష్ట్ర ఫలాలను అనుభవించకుండా  తొలినాళ్లలోనే మనకు దూరమవడం దురదృష్టకరం.


- ఆలేటి రమేశ్