BAN vs SA: 300 వికెట్ల క్లబ్‌లో రబడా.. పాక్ దిగ్గజాన్ని దాటి ప్రపంచ రికార్డ్

BAN vs SA: 300 వికెట్ల క్లబ్‌లో రబడా.. పాక్ దిగ్గజాన్ని దాటి ప్రపంచ రికార్డ్

దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా టెస్ట్ క్రికెట్ లో తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సుదీర్ఘ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్న ఈ సఫారీ పేసర్.. తాజాగా ఒక ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరిన ఈ ఫాస్ట్ బౌలర్ బంతుల పరంగా వేగంగా ఈ ఘనతను అందుకుని ప్రపంచ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 11817 బంతుల్లో రబడా 300 వికెట్లు పడగొట్టాడు. అంతక ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ ఖాన్ పేరిట ఈ రికార్డ్ ఉంది. 

ఈ పాక్ దిగ్గజం 300 వికెట్లు తీయడానికి 12602 బంతులు అవసరమయ్యాయి. ప్రస్తుతం ఢాకా వేదికగా బంగ్లాదేశ్ పై జరుగుతున్న తొలి టెస్టులో ముష్ఫికర్ రహీమ్ ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఆ తర్వాత ఇదే మ్యాచ్ లో లిటన్ దాస్ వికెట్  తీసుకొని తన వికెట్ల సంఖ్యను 301కు పెంచుకున్నాడు. సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో బౌలర్ గా రబడా రికార్డుల్లోకెక్కాడు.

అంతకముందు డేల్ స్టెయిన్ (93 మ్యాచ్‌ల్లో 439 వికెట్లు),షాన్ పొలాక్ (108 మ్యాచ్‌ల్లో 421 వికెట్లు),మఖాయ ఎంతిని  (101 మ్యాచ్‌ల్లో 390 వికెట్లు),అలన్ డొనాల్డ్ (72 మ్యాచ్‌ల్లో 330 వికెట్లు), మోర్నీ మోర్కెల్ (86 మ్యాచ్‌ల్లో 309 వికెట్లు) రబడా కంటే ముందు మూడు వందల వికెట్లు తీసుకున్నారు. టెస్టుల పరంగా వేగంగా 300 వికెట్లు పడగొట్టిన మూడో సౌతాఫ్రికా బౌలర్ గా మరో ఘనత అందుకున్నాడు. రబడా  తన 65వ టెస్టు మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించగా.. 2013లో స్టెయిన్ తన 61వ టెస్టులో, డొనాల్డ్ 2000లో 63వ టెస్టులో ఈ ఫీట్ అందుకున్నారు. 

రబడాతో పాటు మల్డర్, కేశవ్ మహారాజ్ విజృంభించడంతో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు తొలి సెషన్ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మల్డర్ మూడు వికెట్లు తీసుకోగా.. రబడా,కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పీడ్ కు ఒక వికెట్ దక్కింది. 30 పరుగులు చేసిన హసన్ జాయ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.