క్రిమినల్​ పక్షిరాజు: 74 ఏళ్ల జీవితం... జైల్లో 54 ఏళ్లు

క్రిమినల్​ పక్షిరాజు: 74 ఏళ్ల జీవితం... జైల్లో 54 ఏళ్లు

స్వతహాగా ఎవరూ చెడ్డవాళ్లు కారు. వాళ్లలోని అహంకార స్వభావం వల్లే అలా తయారవుతారు. ఆ అహంకారాన్ని నాశనం చేస్తే, వాళ్లు కూడా మంచివాళ్లే అవుతారని ధర్మం చెబుతోంది. అందుకు ఉదాహరణగా పురాణాల్లోని కొందరు రాక్షసులను చూపిస్తోంది. అయితే ఆ ఎగ్జాంపుల్స్ లో కరడుగట్టిన క్రిమినల్ రాబర్ట్ ఫ్రాంక్లిన్ స్ట్రాడ్ కి కూడా ఒక పేజీ ఉంది. పక్షులపై అతనికి ఉన్న ప్రేమే అతన్ని చరిత్రలో నిలిచిపోయే ఒక మేధావిగా తీర్చిదిద్దింది.

అమెరికన్​ ఫెడరల్​ ప్రిజనర్​  లిస్ట్​ లో రాబర్ట్ ఫ్రాంక్లిన్ స్ట్రాడ్  నొటోరియస్​ క్రిమినల్'గా ప్రత్యేకంగా చెక్కి ఉంటుంది. మొత్తం డెబ్బై మూడేళ్లు బతికిన స్ట్రాడ్ .. యాభై నాలుగేళ్లు జైల్లోనే గడిపాడు. రెండు హత్యలు, ఒక ఎటాక్ కేసులో అతనికి అంత శిక్ష పడిందంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ, అతని వయొలెంట్ బిహేవియర్ అంత శిక్ష పడటానికి కారణమైందంటే నమ్మి తీరాల్సిందే. ఇతను పెద్దగా చదువుకోని ఆర్నిథాలజిస్ట్ కూడా. సెల్లో తనతో పాటు పక్షులను కూడా పెంచుకుని స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నాడు స్ట్రాడ్.

పయనం మార్చిన పక్షులు

1920లో లీవెనోవోర్త్ జైల్లో ఉండగా ఒకరోజు గాయపడిన మూడు చిలుకలు స్ట్రాబికి కనిపించాయి. వాటిని చూసి కరిగిపోయిన స్ట్రాడ్.. తన సెల్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకున్నాడు. వాటితోపాటు మరికొన్ని పక్షులు ఆ సెల్లోకి చేరాయి. అలా అలా ఆ సంఖ్య మూడు వందలకు చేరింది. అతని ఆసక్తి గమనించిన అధికారులు అభ్యంతరం చెప్పలేదు. గాయపడిన పక్షులకు చికిత్స చేసే క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. పరిశోధనలు చేశాడు స్ట్రాడ్. అంతేకాదు పక్షుల వ్యాధులు, వాటి చికిత్స కోసం పుస్తకాలు రాసి వాటిని పబ్లిష్ కూడా చేయించాడు. అతని వ్యాసాలు చూసి మేధావులు ఆశ్చర్యపోయారు. కేవలం స్టడీ ద్వారా ఆర్నిథాలజిస్టుగా మారిన స్ట్రాడ్ పై  రైతుల్లో సింపతీ పెరిగింది. అతని సలహాల కోసం జైలుకు క్యూ కట్టారు రైతులు. ఎన్నో మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు స్ట్రాడ్. అతని ప్రవర్తనలో మంచి మార్పు రావడంతో ఆర్జీ పెట్టుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ, తన శిక్షా కాలాన్ని రద్దు చేయాలనో, తగ్గించాలనో ఏనాడూ అధికారులను రిక్వెస్ట్ చేయలేదు అతను. సుమారు 20 ఏళ్ల పాటు ఆర్నిథాలజిస్టుగా అతని పేరు మారుమోగిపోయింది.

అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న టైంలో, స్ట్రాడ్ చేసే కొన్ని పనులు అధికారులకు కోపం తెప్పించాయి. సీక్రెట్​ గా  ఆల్కహాల్​ ను  తయారు చేసుకుంటుండటంతో అతన్ని ఆల్కాట్రాజ్ దీవిలోని జైలుకు తరలించారు. నొటోరియస్ క్రిమినల్స్ ను తప్పించుకోకుండా ఉంచేందుకు ఆ జైలులో పెట్టేవారు. అలాంటి జైల్లో 1942 నుంచి పదిహేడేళ్లపాటు అక్కడే ఉన్నాడు. అయితే అక్కడ పక్షుల్ని పెంచుకునేందుకు మాత్రం అధికారులు అనుమతించలేదు. 

దీంతో పీనల్ సిస్టమ్, శిక్షలు, న్యాయ వ్యవస్థలోని లోపాలపై రచనలు చేశాడతను. 1959లో మిస్సోరీ మెడికల్ సెంటర్​ కు  తరలించగా.. నాలుగేళ్ల తర్వాత అక్కడే చనిపోయాడు. ఇల్లినాయిలో అతని బాడీని పూడ్చిపెట్టారు ఆఫీసర్స్. అయితే స్ట్రాడ్ చనిపోయిన మరుసటి రోజే అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ హత్య జరిగింది. దీంతో ఈ పక్షిరాజా చావువార్త మీడియాలో ఎక్కడో చిన్న వార్తగా మిగిలింది. మూడేళ్ల తర్వాత బ్రూట్ లాంక్ స్టర్ లీడ్ రోల్ లో జాన్ ఫ్రాంకెన్​ హెయిమర్ డైరెక్షన్లో 'బర్డ్ మ్యాన్ ఆఫ్ ఆల్కాట్రాజ్ ' సినిమా వచ్చింది. రాబర్ట్ స్ట్రాడ్ బయోపిక్ గా తీసిన ఈ సినిమాలో చాలా వరకు ఫిక్షన్ జోడించాడు దర్శకుడు ఫ్రాంకెన్. అయినా కూడా 'అమెరికన్ గ్రేటెస్ట్ మూవీస్ లిస్ట్​ లో  చోటు సంపాదించుకుంది ఈ సినిమా.

ఇంట్లోంచి పారిపోయి..

1890లో వాషింగ్టన్, సీటెల్లో పుట్టాడు రాబర్ట్ స్టాడ్. పదమూడేళ్ల వయసులో తండ్రి పెట్టే టార్చర్ భరించలేక ఇంట్లోంచి పారిపోయాడు. కొన్నాళ్లపాటు అలస్కా సరిహద్దులో అమ్మాయిల బ్రోక దందా నడిపాడు. 1909లో పగెట్ సౌండ్ ఏరియాలో ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. తన ఓనర్ తో గొడవపెట్టుకున్న బేరర్ ను కాల్చి చంపాడు స్ట్రాడ్. ఆ కేసులో పన్నెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. అయితే శిక్షా సమయంలో తోటి ఖైదీలపై ఇష్టమొచ్చినట్లు దాడులు చేసేవాడు. ఒకరోజు ఏకంగా గార్డునే కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ కేసులో అతనికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అతని తల్లి వేడుకుంటే, ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది న్యాయస్థానం.