- వేమనపల్లి మండల కేంద్రం శివారు ఊర్లలో స్వైర విహారం
- 24 గంటల్లో 8 మందిపై దాడి
- ఇద్దరికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో పాటు పరిసర గ్రామాల్లో వరుస దాడులతో ఓ పిచ్చికుక్క హడలెత్తిస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి 24 గంటల్లో 8 మందితో పాటు పశువులపై దాడి చేసి గాయపర్చింది. మండల కేంద్రానికి చెందిన గాండ్ల మహేశ్శనివారం అర్ధరాత్రి ప్రాణహిత నదిలో చేపలు పట్టేందుకు వెళ్లగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఎల్లల నగేశ్ నీల్వాయి ప్రాజెక్టుకు చేపలు పట్టేందుకు అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుండగా పోశన్న రైస్‌మిల్లు వద్ద అడ్డం పడి కరిచింది.
ఆర్ఎంపీ డాక్టర్ పున్నం సత్యనారాయణ తన కొడుకు సాత్విక్‌తో కలిసి బైక్‌పై వస్తుండగా బైక్‌ను వెంబడించి సాత్విక్‌ను గాయపర్చింది. అక్కడి నుంచి ఎస్సీ కాలనీ వైపుకు వెళ్లిన పిచ్చికుక్క బైక్‌పై ఉన్న సుంపుటం గ్రామానికి చెందిన కుబిడె మధుని కరిచింది. రాత్రంతా గ్రామంలో స్వైరవిహారం చేసి పశువులను కూడా వదల్లేదు.
ఆదివారం ఉదయం గుమ్ముల సంతోష్‌పై దాడి చేసి దస్నాపూర్ వైపుకు వెళ్లి కోల మహేశ్‌గౌడ్‌ను, కొత్తపల్లి గ్రామం వద్ద బైక్‌పై వెళ్తున్న మంగెనపల్లికి చెందిన తలండి భీమయ్యను కరిచింది. బాధితులంతా వేమనపల్లి పీహెచ్సీలో చికిత్స చేయించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కోల మహేశ్, సాత్విక్‌లను చెన్నూర్‌కు తరలించారు.