హైదరాబాద్‎లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్

హైదరాబాద్‎లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల్ గ్రామంలో ఏటీఎం నుంచి దుండగులు డబ్బులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కట్టర్లు, ఇనుప కడ్డీలతో ఏటీఎంను పగలగొట్టి సుమారు రూ.30 లక్షలు దోచేశారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని 489 బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవని.. సెక్యూరిటీ సిబ్బంది లేదని పోలీసులు గుర్తించారు. 

బ్యాంకుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నట్లు గుర్తించారు. సగానికి పైగా బ్యాంకులు ఇప్పటికీ పాత భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయని తేలింది. అలాగే.. ఏటీఎం లేదా బ్యాంకులో ఏదైనా సంఘటన జరిగితే స్థానిక పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేసే వ్యవస్థలు ఉండాలని ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది. కానీ చాలా బ్యాంకులు, ఏటీఎంల వద్ద అలాంటి వ్యవస్థ లేకపోవడంతో దొంగల పని సులభతరం అవుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు కమిషనరేట్ పరిధిలోని బ్యాంకు ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. 

చాలా బ్యాంకుల్లో నాణ్యత లేని భవనాలు, బలహీనమైన భద్రతా ఏర్పాట్లు, ఓల్డ్ లాకింగ్ వ్యవస్థ, అప్రమత్తత లేకపోవడం లేదా సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడం, పాత అలారం వ్యవస్థ, సీసీ కెమెరాలు లేకపోవడం, డేటా ఫుటేజ్ ఒకే బ్యాకప్ వంటి లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. భద్రతా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలని సూచించారు. అలాగే.. బ్యాంకులు, ఏటీఎంల్లో చోరీలను నివారించడానికి కొత్త భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని బ్యాంకు ప్రతినిధులకు సూచించారు సీపీ సుధీర్ బాబు.