ర్యాపిడో, ఓలా, ఊబర్ ద్వారా డ్రగ్స్ ​సప్లై

  • గ్యాస్ సిలిండర్ వాల్వ్ లలో ప్యాకింగ్​
  • ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు 
  • 190 గ్రాముల హెరాయిన్, బైక్​స్వాధీనం
  • రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడి

హైదరాబాద్: గ్యాస్ వ్యాపారం ముసుగులో ర్యాపిడో, ఓలా, ఊబర్ ద్వారా హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ పీఎస్​పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

రాచకొండ కమిషనరేట్​లో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన మహేష్, మహిపాల్ నేరేడ్మెట్ పరిధిలో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తున్నారు. కస్టమర్లకు డ్రగ్స్ చేరవేయడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు.- నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసే వారిగా పనిచేస్తున్నారు. - అనుమానం రాకుండా- గ్యాస్ సిలిండర్ వాల్వ్ లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. -ఓలా, ఊబర్, ర్యాపిడో సహా ఇతర మార్గాల ద్వారా వీటిని కస్టమర్లకు చేరవేస్తున్నారు. 200 గ్రాముల హెరాయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి... దానిని దాదాపు రూ. 23 నుంచి 25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి నిందితులు డ్రగ్స్ కొంటున్నారు’ అని సీపీ తెలిపారు. 

రూ.88 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

2024 నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో దాదాపు రూ.88 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని  సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. పిల్లలు, యువత ఇలాంటి మత్తు పదార్థాలకు బలికావద్దంటే... ప్రజల సహకారం కూడా కావాలని చెప్పారు. డ్రగ్స్ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని అన్నారు. వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాలేజీల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి తమ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారని సీపీ సుధీర్ బాబు తెలిపారు.