అంతర్​రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్

అంతర్​రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్
  •     రూ.45 లక్షల విలువైన 40 కిలోల గసగసాల గడ్డి, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ 
  •      రాచకొండ సీపీ సుధీర్​ బాబు

మల్కాజిగిరి, వెలుగు: మధ్య ప్రదేశ్​ నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేసే అంతర్ ​రాష్ర్ట ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద  రూ. 45లక్షల విలువైన 40 కిలోల గసగసాల గడ్డి, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రాచకొండ  సీపీ సుధీర్​బాబు సోమవారం నేరెడ్​మెట్​లోని కమిషనరేట్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ లోని జోధ్​పూర్ ​జిల్లాకు చెందిన కార్పెంటర్ ఓంప్రకాశ్​(35) ఈజీ మనీ కోసం డ్రగ్స్​ అమ్ముతూ పలుమార్లు  చిక్కి జైలుకు వెళ్లొచ్చిన పాత నేరస్తుడు.   సిటీకి వచ్చి చందానగర్​లో ఉంటూ, రెయిలింగ్​పనులు చేసే సన్వాలా రామ్​ (33)తో కలిసి  ముఠాగా ఏర్పడ్డారు.  ఈజీగా మనీ సంపాదించేందుకు డ్రగ్స్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. కొద్ది నెలల కిందట వీరికి మధ్యప్రదేశ్​కు చెందిన వికాస్​(32) పరిచయం అయ్యాడు. దీంతో ముగ్గురూ కలిసి గసగసాల గడ్డిని అమ్మి భారీగా సంపాదించవచ్చని తెలుసుకున్నారు.  

వికాస్​ వద్ద డ్రగ్స్​ కొనుగోలు చేసే లారీలు, బస్సులు, ట్రక్కులు, రైళ్లలో సిటీకి తెచ్చి అమ్ముతున్నారు. మళ్లీ వెళ్లి వికాస్ వద్ద 40కిలోల గసగసాల గడ్డి, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను కొని సిటీకి తెస్తుండగా ఎల్​బీనగర్​ఎస్​ఓటీ , జవహర్​నగర్​ పోలీసులు వెళ్లి జవహర్​నగర్​ పీఎస్ పరిధిలోని మల్కారం వద్ద నిఘా వేశారు. నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్స్​తోపాటు  రూ.10వేల నగదు , మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  ఓంరామ్​, సన్వాల రామ్​ను అరెస్టు చేసి  ఎన్​డీపీఎస్​యాక్టు   నమోదు చేశామని సీపీ చెప్పారు. పరారీలో ఉన్న వికాస్​ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిషేధిత డ్రగ్స్​ పట్ల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్​బాబు సూచించారు.  డ్రగ్స్​ అమ్మినా, కొన్నా అది క్షమించరాని నేరమని, పట్టుబడిన నిందితులపై ఎన్​డీపీఎస్​ యాక్ట్  కింద కేసులు నమోదు చేస్తే..  పదేండ్ల  జైలు శిక్ష  పడుతుందని తెలిపారు.