- హైదరాబాద్ వ్యాపారి నుంచి రూ.1.16 కోట్లు కొట్టేసిన ముఠా
- నలుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
- 5 కిలోల నకిలీ గోల్డ్, రూ.6.86 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. రూ.51 లక్షల క్యాష్, 3 కార్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయ్యింది. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ బురిడీ కొట్టిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.51 లక్షలు, 5 కిలోల నకిలీ బంగారం, రూ.6.86 కోట్ల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం వెల్లడించారు.
హైదరాబాద్ లోని బోడుప్పల్‌కు చెందిన దిలీప్ బర్ఫ్(38) స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. బోడుప్పల్‌లో నివాసం ఉండే సింగిరెడ్డి సురేశ్ పోయిన నెల 19న దిలీప్‌కి ఫోన్ చేశాడు. బెంగళూరులో తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని చెప్పాడు. అది నమ్మిన దిలీప్.. సురేశ్ తో కలిసి బెంగళూర్‌లోని టీసీ పల్యకు వెళ్లాడు. అక్కడ కర్రెద్దుల విజయ్‌కుమార్ అలియాస్ కృష్ణ మోహన్ చౌదరి, హరీశ్ లను కలిశాడు. వాళ్లంతా దిలీప్ బర్ఫ్ నుంచి రూ.6 లక్షలు తీసుకుని 81 గ్రాముల బంగారం ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత హరీశ్ బోడుప్పల్ వచ్చాడు. మరో 20 గ్రాముల బంగారం దిలీప్ కు ఇచ్చాడు. దీంతో తక్కువ ధరలోనే బంగారం దొరుకుతున్నదని దిలీప్ నమ్మాడు. ఈ క్రమంలో మరో 2 కిలోల బంగారం కావాలని ఆర్డర్ చేశాడు.
స్టాక్ లేదని చెప్పి..
పోయిన నెల 29న దిలీప్, సురేశ్ మళ్లీ బెంగళూర్ వెళ్లారు. ఆ టైమ్ లో విజయ్‌కుమార్ 5 కిలోల గోల్డ్‌ను కొంతమందికి విక్రయిస్తున్నట్టు నమ్మించాడు. ఈ క్రమంలో తనకు కావాల్సిన 2 కిలోల బంగారం కోసం దిలీప్ రూ.90 లక్షలు ఇచ్చాడు. ఇలా మొత్తంగా ఆయన నుంచి రూ.1.16 కోట్లు వసూలు చేశారు. అయితే గోల్డ్ ఇవ్వాలని విజయ్‌కుమార్‌ను దిలీప్ కోరగా స్టాక్ లేదని చెప్పాడు. బంగారం చెన్నైలో ఉందని చెప్పి దిలీప్, సురేశ్ ను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ నంబూరి డేవిడ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. వీళ్లంతా పోయిన నెల 30న చెన్నైలోని రాయల్ మెరీడియన్ హోటల్‌లో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 35లో బంగారం తీసుకోవాలని దిలీప్ కు చెప్పారు. కానీ ఆ తర్వాత విజయ్‌కుమార్ ఫోన్ కాల్స్ కు స్పందించలేదు. దీంతో మోసపోయానని దిలీప్ గ్రహించాడు. తనకు ఇచ్చింది కూడా నకిలీ గోల్డ్ అని గుర్తించి, ఈ నెల 8న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పాత నేరస్తుల పనే..
నెల్లూరు జిల్లా కావలికి చెందిన కర్రెద్దుల విజయ్‌కుమార్ (39), బోగిరి సునీల్ గవాస్కర్ (27), అడిగొప్పుల ఓంసాయి కిరిటీ(26), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నంబూరి డేవిడ్(52) ముఠాగా ఏర్పడ్డారు. కస్టమ్స్ డిపార్డ్‌మెంట్ నుంచి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే అమ్ముతామని నమ్మిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ బంగారం అంటగడుతున్నారు. ఈ ముఠా నకిలీ బంగారంతో పాటు నకిలీ కరెన్సీ నోట్లు కూడా విక్రయిస్తున్నది. డీల్ కుదుర్చుకునే సమయంలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్‌లో వచ్చి బాధితులను బెదిస్తున్నారు. ఆ తర్వాత డబ్బు, బంగారంతో పారిపోతున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్నది ఏపీకి చెందిన పాత నేరస్తుల ముఠానే అని గుర్తించారు. విజయ్‌కుమార్, సునీల్ గవాస్కర్, ఓంసాయి కిరిటీ, నంబూరి డేవిడ్‌లను అరెస్ట్ చేశారు. వీళ్లను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు.