టిఫిన్ చేద్దామని బస్సు దిగితే.. కిలోన్నర బంగారం కొట్టేశారు..

టిఫిన్ చేద్దామని బస్సు దిగితే.. కిలోన్నర బంగారం కొట్టేశారు..
  • ముంబై నుంచి వెంబడించి.. చౌటుప్పల్ వద్ద కొట్టేసి.. 
  • బస్సులో 1.832 కిలోల బంగారు నగలు చోరీ 
  • మధ్యప్రదేశ్ కు చెందిన థార్​గ్యాంగ్​ సభ్యుడు అరెస్టు 
  • రాచకొండ పోలీసు కమిషనర్ సీపీ సుధీర్​బాబు 

మల్కాజిగిరి, వెలుగు: ముంబై నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ చేసిన థార్ ​గ్యాంగ్ సభ్యుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద చోరీ నగలను స్వాధీనం చేసుకోగా.. విలువ సుమారు రూ.1.26 కోట్లు ఉంటుంది. శుక్రవారం నేరెడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్​లో పోలీసు కమిషనర్ సుధీర్​బాబు మీడియాకు వివరాలు తెలిపారు.  ముంబైకి చెందిన కునాల్ ​కొఠారి(35) స్థానికంగా ఏడీ జువెలరీస్ ఆరం మాల్ లో సేల్స్​ మేనేజర్. ముంబైతో పాటు పూనే, ఏపీలో కూడా గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. 

అతడు గత నెల 26న తమ ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ కు 1.832 కిలోల బంగారు ఆభరణాల బ్యాగు ఇచ్చి విజయవాడకు పంపించాడు. భరత్ కుమార్ ముంబైలో చూనాబట్టి బస్టాప్​లో అదేరోజు రాత్రి 9.30గంటలకు  విజయవాడ వెళ్లే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు(ఏపీ02-ఏ9687) ఎక్కాడు. కాగా.. బస్సులో భారీగా నగలు తీసుకెళ్తున్నారని గమనించిన మధ్యప్రదేశ్​లోని థార్​జిల్లా ధర్మపురికి చెందిన సోనీ ఠాకూర్​(22), అలీఖాన్, అస్లాం కారులో బస్సును వెంబడించారు. మరుసటి రోజు ఉదయం 9.30గంటల ప్రాంతంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధి ధర్మోజిగూడెంలో హైవే పక్కన తాజ్​హోటల్ వద్ద బస్సు ఆగింది. 

నగల బ్యాగును బస్సులోనే ఉంచి, టిఫిన్​చేసేందుకు భరత్ కుమార్ కిందకు దిగాడు. 20 నిమిషాల తర్వాత  వెళ్లి చూడగా బ్యాగులోని నగలు కనిపించలేదు.   దొంగలు వచ్చి నగలు తీసుకుని కారులో పారిపోతుండగా ఓ ప్రయాణికుడు చూసి అతడికి చెప్పాడు. వెంటనే భరత్ కుమార్  ఓనర్ కు తెలిపి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చౌటుప్పల్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బస్సును నంబరు ప్లేటు లేని తెల్లరంగు  క్రెటా కారు వెంబడించినట్టు గుర్తించారు. 

పోలీసులు నాలుగు టీమ్ లుగా ఏర్పడి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు వెళ్లారు. ఒక టీమ్ థార్​జిల్లాలో సోనీ ఠాకూర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. గ్యాంగ్ లుగా ఏర్పడి వివిధ రాష్ర్టాల్లో దోపిడీలకు పాల్పడుతామని, నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తామని నిందితుడు తెలిపాడు. అతని వద్ద  1.832 కిలోల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు అలీఖాన్​, అస్లాం కోసం సెర్చ్ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన చౌటుప్పల్ పోలీసులను సీపీ సుధీర్ బాబు అభినందించారు.