
- జులాయిసినిమాను తలపించేలా 4 నిమిషాల్లో రూ.29.69 లక్షలు లూటీ
- ఏటీఎంలు ఓపెన్ చేయడంపై యూట్యూబ్ వీడియోలతో అవగాహన
- 10 మంది దొంగల్లో ఐదుగురు అరెస్ట్
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఈ నెల 2న జరిగిన ఎస్ బీఐ ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు ట్రెస్ చేశారు. కేవలం 4 నిమిషాల్లో రూ.29.29 లక్షలు లూటీ చేసిన 10 మందిలో ఐదుగురిని పట్టుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన రాహుల్ అలియాస్ రాహుల్ ఖాన్(25) పహాడీ షరీఫ్‌లో ఉంటూ జేసీబీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
ఇతను ఏటీఎంల చోరీలో ఆరితేరాడు. రూరల్ఏరియాల్లోని ఏటీఎంలను టార్గెట్చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. పఠాన్‌చెరులో ఉండే పాత నేరస్తుడు రాజస్థాన్ కు చెందిన ముస్తాఖీం ఖాన్(28)తో కలిసి రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎం చోరీకి స్కెచ్‌వేశాడు. రాజస్థాన్ కు చెందిన షారుఖ్బషీర్ఖాన్(25), రఫీక్ ఖాన్(25), జహుల్ బద్దన్ ఖాన్, వాహిద్ ఖాన్(18), షకీల్ ఖాన్, ఫర్వేజ్, హర్యానాకు చెందిన సుద్బిన్ ఖాన్(28), బిహార్ కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్(28)ను కలుపుకున్నాడు. అప్పటికే ఢిల్లీలో ఉన్న షారుఖ్బషీర్ఖాన్, ముస్తాఖీ ఖాన్, సుద్బిన్ఖాన్, రఫీక్ కు ఫైట్టికెట్లు బుక్‌చేసి సిటీకి రప్పించాడు. అంతా కలిసి ఈ నెల2న రావిర్యాలలో రెక్కీ నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత 1.55 గంటలకు గ్యాస్‌కట్టర్, ఇతర సామాగ్రితో ఏటీఎంలోకి ఎంటరయ్యారు. గ్యాస్‌కట్టర్ తో ఏటీఎం కొల్లగొట్టి రూ.29.69లక్షలు ఎత్తుకెళ్లారు.
ఐదు స్పెషల్ టీమ్స్‌తో గాలింపు..
బ్యాంక్డీఎం శ్రీవాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు ఐదు స్పెషల్టీమ్స్తో గాలింపు చేపట్టారు. చోరీ టైంలో రాజస్థాన్ కు చెందిన కారును వినియోగించారని గుర్తించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు మూవెంట్స్పై నిఘా పెట్టారు. రాహుల్ ఖాన్, ముస్తాఖీం ఖాన్, షకీల్ ఖాన్, వాహిద్ ఖాన్, షారుఖ్ బషీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ ఖాన్ గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఏటీఎంల చోరీకి పాల్పడినట్లు సీపీ తెలిపారు. హైదరాబాద్ తోపాటు ఒడిశాలో గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలను కొల్లగొట్టాడని వెల్లడించారు. నిందితుల్లో ఒకరు సీసీ కెమెరాలకు బ్లాక్ కలర్స్ప్రే చేస్తే, మరొకరు అలారం వైర్లను కట్ చేస్తారని, రాహుల్ ఖాన్, రఫీక్‌ఖాన్ గ్యాస్ కట్టింగ్ లో ఆరితేరారని చెప్పారు. ఏటీఎం ఎలా ఓపెన్చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారని తెలిపారు. 23 రోజుల్లో నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
ఊరు దాటితే.. భారీ మొత్తంలో కొల్లగొట్టాల్సిందే
రావిర్యాల ఏటీఎం చోరీ అనంతరం నిందితులు దారిలో మైలర్ దేవ్ పల్లిలోని ఏటీఎం చోరీకి యత్నించారు. అక్కడ మంటలు రావడంతో ఓపెన్చేయలేకపోయారు. తర్వాత రోడ్డు మార్గంలో రాజస్థాన్ కు వెళ్లిపోయారు. నిందితులంతా హర్యానాలోని మేవాట్ ప్రాంత దొంగల ముఠాగా తేలింది. ఒక్కసారి ఊరు దాటితే భారీగా డబ్బు దోచుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తారు. తుపాకులు, కత్తులు, గొడళ్లతో చోరీలకు పాల్పడుతూ అడ్డువచ్చినవారిని హతమార్చడానికి కూడా వెనుకాడరని పోలీసులు గుర్తించారు.