ప్రముఖుల పేర్లు చెప్పి రూ. కోటి వసూలు

  • 107 మందిని నమ్మించి రూ. కోటి వసూలు
  • ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రభుత్వ సలహాదారుడి అనుచరులమని చెప్పుకుంటూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ చేయిస్తామని మొత్తం 107 మందిని మోసం చేసి వీరు రూ.1.04 కోట్లు వసూలు చేశారు. ఈ మేరకు వివిధ ఠాణాల పరిధిలో నమోదైన కేసులో వీరిని మల్కాజ్ గిరి ఎస్ వో టీ, కీసర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. 

నిందితుల నుంచి రూ.1.29 లక్షల నగదు, 98 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నకిలీ పత్రాలు,8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు -రాచకొండ సీపీ సుధీర్ బాబు శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టైయిన వారిలో కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేంద్ రెడ్డి(34), కీసరకు చెందిన మేరీనా రోజ్ (52), బండ వెంకటేశ్(55), ఏనుగు హర్షిణిరెడ్డి(33), పోచారం ప్రాంతానికి చెందిన బొలుగుల అంజయ్య (34) , జమ్మిగడ్డకు చెందిన కట్రావత్ గోపాల్ (48) ఉన్నారు. ప్రధాన నిందితుడైన సురేందర్ రెడ్డిపై ఇప్పటికే -నేరేడ్మెట్ పీఎస్ లో బెట్టింగ్ కేసు నమోదైనట్లు తెలిపారు.  సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్ వోటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు జానయ్య, ప్రవీణ్, రవికుమార్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.