- జవహర్ నగర్లో ఒకరు అరెస్ట్
- 2 కంట్రీమేడ్ పిస్టల్స్, తపంచా,10 లైవ్ రౌండ్స్ బుల్లెట్స్ సీజ్
హైదరాబాద్, వెలుగు: ఇల్లీగల్‌గా గన్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 కంట్రీమేడ్ పిస్టల్స్, తపంచా,10 లైవ్ రౌండ్స్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు బుధవారం వెల్లడించారు. యూపీకి చెందిన హరేకృష్ణ యాదవ్(26) ఇంటర్ వరకు చదివి, ఉపాధి కోసం 2019లో తన సోదరుడు మురళితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. బీబీనగర్‌లోని ఓ కంపెనీలో పనిచేశాడు. 2022లో పని మానేసి తన సొంతూరికి వెళ్లిపోయాడు. తన గ్రామం బీహార్ బోర్డర్‌లో ఉండడంతో ఆయా చోట్ల తుపాకుల తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారితో పరిచయం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే భోజ్‌పూర్‌కు చెందిన సంపత్ యాదవ్ వద్ద కంట్రీమేడ్ పిస్టల్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ చేశాడు. ఈ నెల మొదటి వారంలో సంపత్ యాదవ్ వద్ద రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, తపంచా,10 లైవ్ రౌండ్స్ బులెల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చాడు. గతంలో తాను పనిచేసిన కంపెనీ వర్కర్లతో పాటు తన సోదరుడు మురళితో కలిసి వీటిని అమ్మాలని ప్లాన్ చేశాడు. దీంతో హరేకృష్ణ గన్స్ విక్రయిస్తున్నాడనే విషయం బయటపడింది. దీంతో భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెట్టి, జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేశారు. సంపత్ యాదవ్ కోసం గాలిస్తున్నామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. భోజ్‌పూర్‌లో తుపాకులు తయారుచేస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.