ఒక్క ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర. వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచులో ఢిఫెండింగ్ ఛాంపియన్ తో చుక్కలు చూపించి ఔరా అనిపించాడు. 23 ఏళ్ల వయసులో ఎంతో అనుభవమున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ.. 93 బంతుల్లోనే అజేయంగా 123 పరుగులు చేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్ తో రచిన్ రవీంద్ర పేరు ప్రపంచ క్రికెట్ లో మారుమోగిపోతుంది. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు. అతని పేరు విచిత్రంగా ఎందుకు ఉంది అని..క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులు. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి.. 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. రచిన్ రవీంద్ర పుట్టి పెరిగింది అక్కడే. రచిన్ రవీంద్ర తండ్రి ఫెవరెట్ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. తన ఆరాధ్య క్రికెటర్ల పేర్లు వచ్చేలా రచిన్ రవీంద్రకు అతని తండ్రి పేరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరు నుంచి 'రా'.. సచిన్ పేరు నుంచి 'చిన్' తీసుకుని రచిన్అనే పేరు తన కొడుకుకు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ దిగ్గజాల అంతటి క్రికెటర్ ను చేయాలని కలలు కన్నాడు. చిన్నప్పటి నుంచి రచిన్ కు క్రికెట్ లో శిక్షణ ఇప్పించాడు.
రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి హాట్ హాక్స్ అనే క్లబ్ ను స్థాపించాడు. తన తండ్రి క్లబ్ తరపున రచిన్ రవీంద్ర క్రికెట్ ఆడేవాడు. రచిన్ తో పాటు..చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఏపీలోని అనంతపురంకు వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవారట. అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కు వచ్చిన క్రికెట్ ఆడి వెళ్లేవారట.
భారత సంతతి ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర.... 2016లో తొలిసారిగా వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ U-19 జట్టుకు ఎంపికయ్యాడు. 2018లో జరిగిన U-19 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత 2021లో బంగ్లాదేశ్‌పై తొలి టీ20 ఆడాడు. 2021లోనే టీమిండియాతో జరిగిన మ్యాచులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2023 లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు రచిన్ రవీంద్ర 3 టెస్ట్‌లు, 12 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.