IND Vs NZ, 1st Test: 4 ఓవర్లలోనే 58 పరుగులు.. అశ్విన్, జడేజాను చితక్కొట్టిన కివీస్

IND Vs NZ, 1st Test: 4 ఓవర్లలోనే 58 పరుగులు.. అశ్విన్, జడేజాను చితక్కొట్టిన కివీస్

బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా చేతులేసింది. రెండో రోజు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన మన ఆటగాళ్లు.. బౌలింగ్ లోనూ వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. మరో మూడు వికెట్లు చేతిలో ఉండగానే న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు లంచ్ సమయానికి కివీస్  7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. రచీన్ రవీంద్ర (104: 125 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సౌథీ (49) క్రీజ్ లో ఉన్నారు. 

మూడో రోజు మ్యాచ్ లో భాగంగా రచీన్ రవీంద్ర, సౌథీ భాగస్వామ్యం హైలెట్ గా నిలిచింది. ఇద్దరూ 8 వికెట్ కు 97 బంతుల్లోనే 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రారంభంలో చక చక నాలుగు వికెట్లు తీసి సత్తా చాటిన భారత బౌలర్లు ఆ తర్వాత సౌథీ, రవీంద్ర జోడీని విడదీయలేకపోయారు. బౌండరీలతో పరుగుల వరద పారించారు. లంచ్ కు ముందు నాలుగు ఓవర్లలో ఏకంగా 58 పరుగులు రాబట్టింది. భారత గడ్డపై మన బౌలర్లను ఈ రేంజ్ లో కొట్టడం చాలా అరుదు. 

అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 78 ఓవర్లో 15 పరుగులు.. జడేజా వేసిన 79 ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత అశ్విన్ వేసిన 80 ఓవర్లో ఏకంగా 20 పరుగులు వస్తే.. సిరాజ్ వేసిన 81 ఓవర్లో 10 పరుగులు రాబట్టుకుంది. బంతి పాత పడడంతో ఈ జోడీ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో రవీంద్ర తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో సౌథీ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఒక్క సెషన్ లో న్యూజిలాండ్ 165 పరుగులు రాబట్టింది.