వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) అదరగొడుతున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ ముందు వరకూ ఓ అనామకుడిగా జట్టులో కొనసాగిన ఈ యువ ఆల్‌రౌండర్ ఒక్కసారిగా మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. ఎంతో అనుభవం ఆన్న ఆటగాడిలా అగ్రశ్రేణి జట్ల బౌలర్లను తునాతునకలు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 70.62 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
అయితే, రచిన్ రవీంద్ర రాణించిన ప్రతిసారి అతని పేరుపై పెద్ద చర్చ జరుగుతోంది. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను మిక్స్ చేసి.. అతనికి రచిన్(రా+చిన్) అని పేరు పెట్టారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఈ పేరు గురుంచి అతని తండ్రి రవి కృష్ణమూర్తి ముందు ప్రస్తావన రాగా, భారత మాజీ క్రికెటర్ల కలయికగా పెట్టారనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
రా+చిన్
"రాచిన్ పుట్టినప్పుడు నా భార్య ఆ పేరు సూచించింది. ఉచ్ఛరించడానికి బాగుందని నేను సరే అన్నా.. దాని గురించి చర్చించడానికి ఎక్కువ సమయం కేటాయించలేదు. కొన్నేళ్ల తర్వాత ఆ పేరు రాహుల్, సచిన్ పేర్ల కలయిక అని మేము గ్రహించాము. మా బిడ్డను క్రికెటర్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో అతనికి ఆ పేరు పెట్టలేదు.." అని రచిన్ రవీంద్ర తండ్రి పేరుపై స్పష్టతనిచ్చాడు.
Rachin Ravindra's father denies naming after Rahul Dravid and Sachin Tendulkar. pic.twitter.com/WBafcptVUM
— CricTracker (@Cricketracker) November 14, 2023
న్యూజిలాండ్‌కు వలస..
కాగా, రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన యువకుడే. అతని తల్లిదండ్రులు బెంగుళూరుకు చెందినవారు. తండ్రి పేరు.. రవి కృష్ణమూర్తి, తల్లి పేరు.. దీప. ఈ దంపతులు ఉపాధి కోసం 1990ల్లో న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. అక్కడే రచిన్ రవీంద్ర జన్మించాడు.