NZ vs SA: ఫార్మాట్ ఏదైనా తగ్గేదే లేదు: డబుల్ సెంచరీతో అదరగొట్టిన రచిన్ రవీంద్ర

NZ vs SA: ఫార్మాట్ ఏదైనా తగ్గేదే లేదు: డబుల్ సెంచరీతో అదరగొట్టిన రచిన్ రవీంద్ర

న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర క్రికెట్ లో తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోతున్నాడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో 500 పైగా పరుగులు చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ యంగ్ ఆల్ రౌండర్..  తాజాగా టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. దక్షిణాఫ్రికాపై బే ఓవల్, మౌంట్ మాంగనూయ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రచిన్..366 బంతుల్లో 240 పరుగులు చేశాడు.రచిన్ ఇన్నింగ్స్ లో 26 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 

2022 లో శ్రీలంకపై చివరిసారిగా ఆడిన ఈ యువ ఆల్ రౌండర్ పేలవ ఫామ్ తో టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయాడు. వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో జట్టులో అన్ని ఫార్మాట్ లలో చోటు దక్కించుకున్నాడు. తొలి రోజు సెంచరీ (118) తో ఆకట్టుకోగా.. రెండో రోజు అదే జోరును కొనసాగించాడు. వేగంగా ఆడుతూ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో చిన్న వయసులో టెస్టుల్లో డబుల్  సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డ్ మాజీ బ్యాటర్ మాథ్యూ సింక్లెయిర్  పేరిట ఉంది. 1999లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సింక్లెయిర్ డబుల్ సెంచరీ చేశాడు.

రచిన్ రవీంద్రకు తోడు విలియంసన్(118) సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. 2 వికెట్లకు 258 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ మరో 353 పరుగులు జోడించింది. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. జేమిసన్ 2 వికెట్లు, హెన్రీ,సాంట్నర్ లకు తలో వికెట్ లభించింది.