ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లను నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక మీడియా యజమానులకు కూడా వదల్లేదని.. కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసినవారిని కూడా టార్గెట్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు.
బీఎల్ సంతోష్ ని అరెస్ట్ చేస్తే లిక్కర్ కేసులో కవితను తప్పి్ంచవచ్చునని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తెలిపారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నట్లు కేసీఆర్ కు సమాచారం రావడంతో కొందరు వ్యక్తులపై నిఘా పెట్టాలని ఐబీ చీఫ్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి కొన్ని ఆడియోలు కేసీఆర్ కు ఇచ్చారని.. ట్యాపింగ్ క్లిప్ లు చేతికి అందాక ఫాంహౌస్ ట్రాప్ కోసం ఢిల్లీ నుంచి ఖరీదైన స్పై కెమెరాలు, మెటీరియల్ కొనిపించినట్లుగా తన వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు.