హిందూ పురాణాల ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజు పూజిస్తారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని మాఘమాసం శుక్ల పక్షం సప్తమి రోజున పూజిస్తారు. ఆరోజు సూర్య భగవానుడు పుట్టిన రోజు రథ సప్తమి. సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథ సప్తమి ఎంతో అత్యుత్తమైనదిగా పండితులు చెబుతారు. ఈ ఏడాదిలో రథ సప్తమి ఎప్పుడొచ్చింది.. సూర్యుడి ఆరాధనకు శుభ సమయం ఎప్పుడు.. సూర్యభగవానుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. . .
హిందువుల పంచాంగం ప్రకారం మాఘమాసం కొనసాగుతుంది. అంటే తెలుగు నెలల ప్రకారం 11 వ నెల. ఈ నెలలో రథసప్తమి ( ఫిబ్రవరి) పండుగను ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4న వచ్చింది. రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందటం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.
శుభ ముహుర్తం..
ధృక్ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షం సప్తమి తిథి ఫిబ్రవరి 4 ఉదయం 4:37 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 05 తెల్లవారుజామున 02:30 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో రథసప్తమి ఫిబ్రవరి 04 న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆరోజు ఎలా స్నానం చేయాలి..
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో పురుషులు తల మీద ఏడు జిల్లేడు ఆకులు.. మహిళలు చిక్కుడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్క పత్రాలని పేరు. సూర్యుడిని కూడా కూడా అర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహా ప్రీతి.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడు మొత్తం పన్నెండు రాశులని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది.మేషం నుంచి మీన రాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు. సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. ఒక్క సూర్య భగవానుడిని మాత్రమే 12 రూపాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు. ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షణని బట్టి ఆ 12 పేర్లు వచ్చాయి.
రథసప్తమి పూజా విధానం
రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే అర్ఘ్యం అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఇలా కనీసం 108 సార్లు చేయాలని పండితులు చెబుతున్నారు.
సూర్యభగవానుడి ఆశీస్సుల కోసం పరిహారాలు
రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది. ఆరోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి. అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి.
జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఆరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలు... పన్నెండు చక్రాలను పన్నెండు రాశులుగా భావిస్తారు.