తిరుమల అప్​ డేట్​: శ్రీవారి మినీ బ్రహ్మోత్సవం.. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనం.. ఎప్పుడంటే..

తిరుమల అప్​ డేట్​: శ్రీవారి మినీ బ్రహ్మోత్సవం.. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనం.. ఎప్పుడంటే..

తిరుమలేశుడు ఉత్సవాల దేవుడు... ఆయన సన్నిధిలో లోకకళ్యాణం కోసం ఏడాదిలో సుమారు 450 రకాల ఉత్సవాలు జరుగుతాయి. అందులో సూర్యజయంతి .. రథసప్తమి రోజు జరిగే ఉత్సవం  ఎంతో ముఖ్యమైంది. బ్రహ్మోత్సవాల్లాగేనే రథసప్తమి రోజున ( ఫిబ్రవరి 4)  ఎంతో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు (ఫిబ్రవరి 4)  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు వస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 4 న జరిపేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

బ్రహ్మోత్సవాల్లో మాత్రమే  తొమ్మిది రోజులపాటు ఉదయం.. సాయంత్రం వేళల్లో వివిధ రకాల సేవల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వా మివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే, సూర్యజయంతి.. రథసప్తమి ( ఫిబ్రవరి 4)  సందర్భంగా  ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల,చంద్రప్రభ వాహనాలపై స్వామివారిని దర్శించుకో వచ్చు.   

వాహన సేవలతోపాటు సుదర్శన చక్రత్తా ళ్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున ( 2025 ఫిబ్రవరి 4)  ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఒకే రోజు ఏడు వాహనసేవల్లో స్వామివారిని దర్శించుకోవటంతో ఒక్క రోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. 

500 ఏళ్లుగా.. 

తిరుమల ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణాతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 

ALSO READ : తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..

మాఢవీధుల్లో చలువ పందిళ్లు

రధసప్తమి సందర్భంగా స్వామివారిని  దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరిగుతోంది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించుకునేందుకు మాడ వీధుల్లో భక్తులు బారులు తీరుతుంటారు. అలాంటప్పుడు ఎండవల్ల ఇబ్బంది పడతారు. వాన కురిసినా ఇబ్బందే కదా.. . అందుకే టీటీడీ అధికారులు  నాలుగు మాడ వీధుల్లో తాత్కాలిక చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. 

సూర్యప్రభ వాహనం(ఉదయం 5.30  నుంచి 8 గంటల వరకు) 

శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. రథసప్తమి పర్వదినంలో అత్యంత ప్రధానమైన వాహన సేవ ఇది. సూర్య భగవానుడు తన ఉషారేఖలను స్వామివారిపై ప్రసరించే ఘట్టాన్ని దర్శించుకునే గొప్ప అవకాశం ఇది. సూర్యప్రభవాహనంపై ఉన్న శ్రీనివాసుని దర్శనం వలన ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానంవంటి ఫలాలు సిద్ధిస్తాయి. 

చిన్న శేష వాహనం ( ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు)

మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపూ ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. .శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్నిదర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. 

ALSO READ : తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం.. ఫిబ్రవరి 26న ద్వారపూడిలో ప్రారంభం

గరుడ వాహనం (ఉదయం 11 నుంచి 12 గంటల వరకు) 

స్వామివారికి ఎన్ని వాహనసేవలు చేసినా ఆయనకు ఇష్టమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత ఉండదు. గరుడ వాహనంలో మలయప్పస్వా మివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు తన దివ్యమంగళ రూప దర్శనమిస్తారు. జ్ఞానవైరాగ్యరూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. 

హనుమంత వాహనం (మధ్యాహ్నం  1 నుంచి 2గంటల వరకు) 

భక్తులకు నిజమైన భక్తిరసం..శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతారు. శేషాచలాధీశుడు శ్రీరాముడి అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తుల్లో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ .. హనుమంతులు తత్త్వవివేదన తెలిసిన మహనీయులు..  అందుకే వాళ్లను చూసిన వారికి వేదాలతత్వం తెలుస్తుంది. 

చక్రస్నానం (మధ్యాహ్నం  2 నుంచి 3గంటల వరకు) 

యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే చక్రస్నానం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ క్రతువు చివరి రోజు నిర్వహించటం సంప్రదాయం. అయితే, రధసప్తమి వాడు మాత్రం వైభావన అగమోక్తంగా ఉదయం వాహన సేవలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం నిర్వహిస్తారు. భూవరాహస్వామి సన్నధి ఆవరణలో పుష్కరిణి గట్టుపై ఉభయదేవరులతో కలిసి శ్రీవారి నరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సందర్భంగా భక్తులందరూ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. 

కల్ప వృక్ష వాహనం (సాయంత్రం  4 గంటల నుంచి 5గంటల వరకు) 

సకల కోరికలను నెరవేర్చే  దైవ వృక్షం అయిన కల్పవృక్ష వాహనంపై స్వామివారు తన ఉభయ దేవేరులతో కూడి తిరువీధుల్లో ఊరేగుతూ అనుగ్రహిస్తాడు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు అవి కాసే పండ్లు మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ, కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ఇస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వలన శ్రీవారు కోరిన వరాలను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. 

ALSO READ : Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!

సర్వభూపాల వాహనం  (సాయంత్రం  6 గంటల నుంచి 7గంటల వరకు)   

సకల చరాచర జగత్పాలకుడైన స్వామివారు... శ్రీదేవి, భూదేవి సమేత రాజసం ఉట్టి పడుతుండగా, ప్రౌఢ గాంభీర్యంతో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయహస్తాన్ని అనుగ్రహిస్తాడు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అది అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం.  తూర్పు దిక్కుకు ఇంద్రుడు...ఆగ్నేయానికి అగ్ని... దక్షిణానికి యముడు .. నైరుతికి నిర్మతి.. పశ్చిమానికి వరుణుడు.. వాయువ్యానికి వాయువు..ఉత్తరానికి కుబేరుడు..ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు.. 

చంద్రప్రభ వాహనం  (రాత్రి 8 గంటల నుంచి 9గంటల వరకు) 

ఈ రథసప్తమి పర్వదినాన భానుడి  లేలేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్తవాహన శోభ వెన్నెల రేడైన చంద్రుని చల్లని కాంతులు తాకే వేళ చంద్రప్రభ వాహనసేవతో ముగుస్తుంది. శ్రీమలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం... చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభవాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.