ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డును కలుపుతూ.. 50 రేడియల్​ రోడ్లు

ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డును కలుపుతూ.. 50 రేడియల్​ రోడ్లు
  • మొదటి దశలో ఓఆర్ఆర్ ​నుంచి ఆమన్​గల్ వరకూ ఒక రోడ్డు  
  • లే అవుట్లు, వెంచర్లు వేసి ఆదాయం పెంచుకునే యోచన  
  • హెచ్ఎండీఏ పరిధిని పెంచే నిర్ణయం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్​రోడ్ (ట్రిపుల్ ఆర్​)ను ఔటర్ రింగ్​రోడ్​తో లింక్​ చేస్తూ పలు ప్రాంతాల్లో రేడియల్​రోడ్ల నిర్మాణానికి  ప్లాన్లు సిద్ధం చేసింది. రేడియల్​రోడ్ల నిర్మాణాల బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగిస్తూ నోడల్​ఏజెన్సీగా నియమించగా.. డీపీఆర్​ కూడా సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోడ్లను మున్సిపల్​ శాఖ నిర్మిస్తుండగా, మరికొన్నింటికి ఆర్అండ్​బీ నిధులను అందజేయనుంది.

ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,225 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉండగా, రానున్న రోజుల్లో 10వేల చదరపు కిలోమీటర్లు పెరగనుంది.  ప్రస్తుతం హెచ్ఎండీఏ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి  జిల్లాల వరకు ఉండగా, అదనంగా మరో రెండు లేదా మూడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ ​వరకూ పెంచుతున్న నేపథ్యంలో ట్రిపుల్​ఆర్​వరకూ హెచ్ఎండీఏను విస్తరించేందుకు కూడా రాష్ట్ర  ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

రేడియల్​ రోడ్లతో కనెక్టివిటీ

ట్రిపుల్​ఆర్​పరిధిలో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్​పూర్, భువనగిరి, ఆమన్​గల్​, యాచారం, కందుకూరు, షాద్​నగర్, చేవెళ్ల, కంది తదితర దాదాపు 50 ప్రాంతాలుండగా, ఈ ఏరియాలకు రేడియల్​ రోడ్లు  నిర్మించి ఓఆర్ఆర్..ట్రిపుల్​ఆర్​ను లింక్​చేస్తారు. మొదటి దశలో ఓఆర్ఆర్​ ఎగ్జిట్13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్​గల్ వరకూ ఒక రేడియల్​రోడ్​ నిర్మిస్తారు.

కొంగర కుర్ధు, కొంగర కలాన్​, ఫిరోజ్​గూడ, లేమూరు, తిమ్మాపూర్​, రాచలూరు, గుమ్మడి వెల్లి, పంజాగూడ, మీర్​ఖాన్​పేట, ముచ్చర్ల, కుర్మిద్ద, కడ్తాల్​ నుంచి ఆమన్​గల్​ వరకూ దాదాపు 42 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఇలా నిర్మించిన రేడియల్ ​రోడ్ల పరిధిలోని ఏరియాల్లో అభివృద్ధి పనులకు హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది.  

ఆదాయం పెంచుకునే ఆలోచన 

రేడియల్​ రోడ్ల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న దృష్ట్యా హెచ్ఎండీఏ ఆయా ప్రాంతాల్లో ల్యాండ్​ పూలింగ్ ​స్కీమ్స్ అమలు చేయాలని ప్లాన్లు రూపొందించింది. ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​పరిధిలో మొదటి దశలో రేడియల్ ​రోడ్ల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. మొదటి దశలో 360 ఎకరాలను, రెండోదశలో180 ఎకరాలను తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది.

ఇలా సేకరించిన భూముల్లో లే అవుట్స్​ వేసి వెంచర్లు వేయాలని, పెద్దసంఖ్యలో టౌన్​ షిప్స్​ నిర్మించాలని నిర్ణయించింది. రైతుల నుంచి సేకరించి భూముల్లో కానీ, టౌన్​ షిప్​నిర్మాణాల్లోనూ 60 శాతం భూములు ఇచ్చిన రైతులకు, మరో 40 శాతం హెచ్ఎండీఏ తీసుకోనున్నది. ఇలా భూములను, టౌన్​షిప్​లను అమ్ముకోవడం ద్వారా హెచ్ఎండీఏ భారీగా నిధులను సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి డీపీఆర్​కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు.