- రూ.లక్షా 20 వేలు స్వాధీనం
- వివరాలు తెలిపిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ అర్బన్, వెలుగు : నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్ టెల్ సెల్ ఫోన్ టవర్లను టార్గెట్ చేసుకొని, అందులోని 5జీ రేడియో రిమోట్ యూనిట్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆ వివరాలను తెలియజేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం ధీరావత్ తండాకు చెందిన ధీరావత్ నగేశ్, ధీరావత్ చిరంజీవి , ధరావత్ మురళి, పానుగోతు సుమన్, ధీరావత్ నవీన్ గతంలో కొత్త సెల్ టవర్ల నిర్మాణం , మెయింటనెన్స్ కంపెనీల్లో పని చేసి మానేశారు.
ఎయిర్ టెల్ కంపెనీ 5జీ నెట్వర్క్సిగ్నల్ విస్తరణ కోసం ఇటీవల తమ సంస్థ టవర్లలో కొత్త రేడియో రిమోట్ యూనిట్లను ఫిట్ చేసింది. గతంలో సెల్ టవర్లలో పని చేసిన అనుభవం ఉండడంతో ముఠాగా ఏర్పడి 5జి యూనిట్లను దొంగిలించడం మొదలుపెట్టారు. వినియోగదారుడికి సిగ్నల్ ప్రాబ్లం రాకుండా ముందున్న 4 జి యూనిట్లను అలాగే ఉంచేవారు . దీంతో దొంగతనం జరిగిన విషయం తెలియడానికి చాలా సమయం పట్టేది. దీన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ ప్రతినిధులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ అంతిరెడ్డి లను టీంగా ఏర్పాటు చేశారు. వారి విచారణలో నిందితుల్లో కొందరు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శివారులో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మాడ్గులపల్లి, వాడపల్లి, మిర్యాలగూడెం, చింతపల్లి, తిరుమలగిరి, నాగార్జునసాగర్, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి, ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దాచేపల్లిల్లో ఉన్న 13 టవర్లలో 5జి యూనిట్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు.
దొంగిలించిన వాటిని హైదరాబాద్ నాంపల్లిలోని ఢిల్లీకి చెందిన మున్నాకు అమ్మారు. నిందితుల దగ్గరి నుంచి రూ.1,20,000 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తాళం వే సి ఉన్న ఇండ్లల్లో దొంగతనం చేసిన12 కేసులు కూడా నమోదై ఉన్నాయి. ధీరావత్ నగేశ్, మున్నా పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్స్విష్ణువర్ధన్ గిరి, మధు, కానిస్టేబుల్ గిరిబాబు, శ్రీనును ఎస్పీ అభినందించారు .