ఇండియా, బంగ్లా బార్డర్​లో ఉర్దూ, అరబిక్​లో రేడియో సిగ్నల్స్

ఇండియా, బంగ్లా బార్డర్​లో ఉర్దూ, అరబిక్​లో రేడియో సిగ్నల్స్

కోల్​కతా:  దేశంపై దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నుతున్నారని అమెచ్యూర్ హ్యామ్ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. గత డిసెంబర్ లో వెస్ట్​బెంగాల్​లోని 24 ఉత్తర పరగణాస్ జిల్లా సోదేపూర్​లో మొదటిసారి అనుమానాస్పద రేడియో సిగ్నల్ గుర్తించామని చెప్పింది. మొదట్లో దీన్ని అంతగా పట్టించుకోనప్పటికీ, బసిర్హాట్, బొంగావ్, 24 దక్షిణ పరగణాల్ జిల్లాల్లోనూ అదేమాదిరి సంకేతాలు రావడంతో ఆందోళన గురయ్యామంది. జనవరి మధ్యలోనూ అలాంటి సంకేతాలను విన్నట్లు తమ వినియోగదారులు నివేదించారని వెల్లడించింది.

 దీంతో ఆ సిగ్నల్స్ సంగతేంటో తేల్చేందుకు ప్రయత్నించగా, బంగ్లాదేశ్ యాసలో ఉర్దూ, అరబిక్ కోడ్ లాంగ్వేజీల్లో సిగ్నల్స్ వస్తున్నట్లు గుర్తించామని అమెచ్యూర్ అధికారులు తెలిపారు. కొన్నిసార్లు ఇతర భాషల్లోనూ కోడ్ లాంగ్వేజ్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకుంటున్నారని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు తెలియజేశామని, వాళ్లు మాట్లాడుకుంటున్న కోడ్ లాంగ్వేజీని ట్రేస్  చేసేందుకు కోల్​కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్​కు కూడా సమాచారాన్ని పంపించామని తెలిపారు. స్మగ్లర్లు, టెర్రరిస్టులు, ఇంటర్నేషనల్ గ్యాంగ్​స్టర్లు ఇలాంటి కోడ్ లాంగ్వేజీలోనే వాళ్ల రహస్య విషయాల గురించి మాట్లాడుకుంటారని వివరించారు. కోడ్ సిగ్నల్స్​ను ట్రాక్ చేయడం కష్టమే అయినా, తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.