మెషీన్లు రావు.. డాక్టర్లు లేరు.. జనగామలోని టీ హబ్, రేడియాలజీ సెంటర్‌‌లో డాక్టర్ల కొరత

  • సెంటర్‌‌కే రాని సిటీ స్కాన్‌‌ మెషీన్‌‌
  • వచ్చినా వాడలేని పరిస్థితిలో 2డీ ఎకో
  • వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌‌ సెంటర్లు
  • ఇబ్బందుల్లో రోగులు

జనగామ, వెలుగు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఫ్రీగా టెస్టులు చేసేందుకు గత ప్రభుత్వం జనగామలో ఏర్పాటు చేసిన రేడియాలజీ, టీ హబ్‌‌లు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. హబ్‌‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం డాక్టర్ల రిక్రూట్‌‌మెంట్‌‌లో నిర్లక్ష్యం చేయడంతో టెస్టులు చేసే వారు లేక విలువైన పరికరాలు మూలకు పడుతుండగా, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న అరకొర స్టాఫ్‌‌పై విపరీతంగా పనిభారం పడుతోంది. మరో వైపు ఈ సెంటర్లు జిల్లా హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ కంట్రోల్‌‌లో పనిచేస్తుండగా, జీతాలు, తదితర ఖర్చులపై డీఎంహెచ్‌‌వో అజమాయిషీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్‌‌ లేకపోవడం మరో సమస్యగా మారింది. 

మూలకు పడిన 2డీ ఎకో మెషీన్‌‌

జనగామ పట్టణంలోని మున్సిపల్‌‌ ఆఫీస్‌‌ పక్కన ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్‌‌ను ఈ యేడాది ఏప్రిల్‌‌లో అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. జనగామను మెడికల్‌‌ హబ్‌‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా సిటీ స్కాన్‌‌, గుండె పరీక్షల కోసం ఉపయోగించే 2డీ ఎకో వంటి టెస్టులు ఈ సెంటర్లో చేయడం లేదు. సిటీ స్కాన్‌‌ మెషీన్‌‌ ఇప్పటివరకు సెంటర్‌‌కే రాలేదు.

జిల్లా హాస్పిటల్‌‌లోని సిటీ స్కాన్‌‌ మెషీన్‌‌ నాలుగేండ్ల కింద పాడవడంతో రిపేర్‌‌ చేయించాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. దీంతో రేడియాలజీ హబ్‌‌లో మెషీన్‌‌ అందుబాటులోకి వస్తుందని ఇన్నాళ్లూ దాటవేశారు. హబ్‌‌ ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటివరకీ సిటీ స్కాన్‌‌ మెషీన్‌‌ ఏర్పాటు చేయలేదు. మరోవైపు 2డీ ఎకో మెషీన్‌‌ అందుబాటులో ఉన్నప్పటికీ రిపోర్టులు ఇచ్చేందుకు కార్డియాలజిస్ట్‌‌ను నియమించలేదు. దీంతో ఆ మెషీన్‌‌  నిరుపయోగంగానే మారి దుమ్ము పట్టిపోతోంది. ప్రైవేట్‌‌లో సిటీ స్కాన్‌‌ కోసం రూ.2 వేల నుంచి రూ. 3 వేలు, 2డీ ఎకో కోసం రూ. 1200పైగా వసూలు చేస్తుండడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

వెరిఫికేషన్‌‌ లేకుండానే రిపోర్టులు

జనగామ జిల్లా హాస్పిటల్‌‌ ఎదురుగా ఏర్పాటు చేసిన టీ డయాగ్నస్టిక్‌‌ హబ్‌‌లోనూ డాక్టర్ల కొరత వేధిస్తోంది. టెస్టులకు సంబంధించి వెరిఫికేషన్‌‌ లేకుండా ల్యాబ్‌‌ టెక్నీషియన్లే రిపోర్టులు ఇస్తున్నారు. ఈ సెంటర్‌‌లో పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, బయె కెమిస్ట్​డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఈ ముగ్గురూ లేరు. దీంతో ల్యాబ్‌‌ మేనేజర్‌‌పై పని భారం పడుతోంది. ప్రతీ రోజు సుమారు 500 వరకు శాంపిల్స్‌‌ వస్తుండడంతో ఈ రిపోర్ట్‌‌ల తయారీ ఇబ్బందిగా మారింది.

డాక్టర్లు పర్యవేక్షించిన తర్వార రిపోర్టులు ఇవ్వాల్సి ఉండగా అదేమీ జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సెంటర్‌‌లో 134 రకాల టెస్టులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 106 రకాల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. డాక్టర్ల కొరత కారణంగా పూర్తి స్థాయిలో టెస్టులు అందుబాటులో రావడం లేదు.

త్వరలో అందుబాటులోకి తెస్తాం 

రేడియాలజీ హబ్‌‌లో త్వరలోనే సిటీ స్కాన్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తాం, 2డీ ఎకో మెషీన్‌‌ ఉన్నప్పటికీ టెక్నీషియన్‌‌ లేడు. కార్డియాలజిస్ట్‌‌ డాక్టర్‌‌ అలాట్‌‌మెంట్‌‌ కూడా లేదు. ప్రస్తుతం ఉన్న డాక్టర్లకు ట్రైనింగ్​ఇప్పించి 2డీ ఎకో సేవలు అందేలా చూస్తాం. టీ డయాగ్నస్టిక్ సెంటర్‌‌లో సీనియర్‌‌ రెసిడెంట్‌‌ డాక్టర్లు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-  డాక్టర్‌‌ అనురాధ, జిల్లా హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌, జనగామ