
న్యూఢిల్లీ: మన దేశ నేవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్–మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ డీల్‌కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది. దీని విలువ రూ.64 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులో ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ సెబాస్టియన్ లెకోర్న్ భారత పర్యటనకు రానున్నారని, అప్పుడు ఒప్పందం జరుగుతుందని డిఫెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఐదేండ్లకు యుద్ధ విమానాల డెలివరీ మొదలవుతుంది. 2031 నాటికి మొత్తం 26 రాఫెల్–మెరైన్ ఫైటర్ జెట్స్ నేవీ చేతికి అందే అవకాశం ఉంది. ఈ డీల్‌లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నుంచి మెయింటెనెన్స్, లాజిస్టికల్ సపోర్టు, శిక్షణ అందుతుంది. కొన్ని విడిభాగాలు దేశీయంగా తయారుచేయాలనే నిబంధన కూడా ఉన్నట్టు తెలిసింది. కాగా, రాఫెల్–మెరైన్ జెట్స్ కొనుగోలు చేసేందుకు 2023లోనే డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చింది.
అడ్వాన్స్‌డ్ మెరైన్ జెట్స్..
ఈ డీల్‌లో భాగంగా 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ జెట్స్‌ను కేంద్రం కొనుగోలు చేయనుంది. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకపై మోహరించనుంది. తద్వారా ఇండియన్ ఓషియన్‌లో మన బలాన్ని పెంచుకోవాలని కేంద్రం భావిస్తున్నది. రాఫెల్–మెరైన్ జెట్స్‌ను ప్రపంచంలోనే అత్యాధునిక నావల్ ఫైటర్ జెట్స్‌గా పరిగణిస్తారు.
వీటికి ల్యాండింగ్ గేర్లు, ఫోల్డింగ్ వింగ్స్, డెక్ ల్యాండింగ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే మన దేశ ఎయిర్‌ఫోర్స్ దగ్గర 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మరిన్ని రాఫెల్ జెట్స్ కొనుగోలు చేయాలని ఐఏఎఫ్ ఆలోచన చేస్తున్నది. కాగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) దేశీయంగా తయారు చేసిన ఐదో తరం ఫైటర్ జెట్స్‌ను కూడా మోహరించేందుకు నేవీ ప్లాన్ చేస్తున్నది.