- వేలేరులోనే కొనసాగించాలని కాంగ్రెస్, అక్కన్నపేటకు మార్చాలని బీఆర్‌ఎస్
- ప్రజాభిప్రాయ సేకరణలో కొట్టుకున్న ఇరువర్గాలు
ధర్మసాగర్ (వేలేరు), వెలుగు : హనుమకొండ జిల్లా కన్నారం గ్రామం ఏ మండలంలో ఉండాలనే విషయంపై శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామాన్ని వేలేరు మండలంలోనే కొనసాగించాలని కాంగ్రెస్, అక్కన్నపేట మండలంలోకి మార్చాలని బీఆర్‌ఎస్ లీడర్లు పట్టుబట్టడంతో గందరగోళం ఏర్పడింది. సర్పంచ్, ఎంపీటీసీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని కన్నారం గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్ హుస్నాబాద్‌కు వచ్చిన టైంలో కన్నారం గ్రామాన్ని అక్కన్నపేట మండలంలో చేర్చాలని ప్లకార్డులు ప్రదర్శించారు. గమనించిన కేటీఆర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వేలేరు తహసీల్దార్ కొమి ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే ఎక్కువ మంది వేలేరు మండలంలోనే కొనసాగించాలని పట్టుబట్టారు.
దీంతో బీఆర్ఎస్ లీడర్లు కొందరు వారించే ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా పట్టుకొని కన్నారం గ్రామాన్ని వేలేరులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న తహసీల్దార్, ఆర్‌ఐ, ఇతర ఆఫీసర్లు నచ్చజెప్పారు. ఇదే టైంలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఎంపీటీసీ వర్గీయులు, బీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్ మార్క మల్లిక భర్త రాజుతో పాటు వారి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎంపీటీసీ, సర్పంచ్ వర్గాల మధ్య మాటామాట పెరగడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా పలువురికి గాయాలు అయ్యాయి. అనంతరం ఒకరి మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణకు మీటింగ్ ఏర్పాటు చేశారని, కేవలం సర్పంచ్ వర్గానికే సమాచారం ఇచ్చి, గ్రామస్తులకు ఎవరికీ విషయం తెలియనివ్వలేదని పలువురు ఆరోపించారు.