వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

వరంగల్: వరంగల్: వరంగల్‎లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలంరేపింది. ఎంబీబీస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. థర్డ్ ఇయర్ చదువుతున్న ముగ్గరు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితుడు రాజస్థాన్‎కు చెందిన విద్యార్థి. జాతీయస్థాయి మెడికల్ సీట్ల కోటాలో బాధితుడికి కేఎంసీలో సీటు లభిచింది. ఘటన గురించి విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజీ అధికారులకు పిర్యాదు చేశారు. దాంతో ర్యాగింగ్‎కు పాల్పడిన ముగ్గురు సీనియర్లు.. జూనియర్ విద్యార్థికి క్షమాపణలు చెప్పారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడంతో ర్యాగింగ్ వివాదం సద్దుమణిగింది.

కాగా.. ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ స్పందించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికోల మధ్య ర్యాగింగ్ ఘటనలో వాస్తవం లేదని ఆయన అన్నారు. ‘ఫుట్ బాల్ ఆడుతున్న క్రమంలో జూనియర్, సీనియర్ విద్యార్ధుల మధ్య గొడవ జరిగింది. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని ఒక జూనియర్ విద్యార్థిని ముగ్గురు సీనియర్లు పిలిచి హాస్టల్‎లో గొడవ పడ్డారు. వీరి మధ్య వాగ్వాదం చోటు చేకుంది. పరస్పరం క్షమాపణ చెప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఘటన గురించి విచారణ జరుపుతున్నాం. ర్యాగింగ్ చేస్తే చర్యలు తప్పవు. జూనియర్ విద్యార్థి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి. విద్యార్థి తల్లిదండ్రులు కానీ, ఆ జూనియర్ విద్యార్థి కానీ తనకు ఎలాంటి పిర్యాదు చేయలేదు. ర్యాగింగ్ ఇష్యూస్ ఉంటే నేరుగా కానీ, మెయిల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చు. హాస్టల్స్‎తో పాటు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అని ప్రిన్సిపాల్ అన్నారు.