జార్ఖండ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. 81 అసెంబ్లీ స్థానాలలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం రాష్ట్రంలోని 24 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చట్రాలో గరిష్టంగా 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా చందన్క్యారి మరియు టోర్పాలలో అత్యల్పంగా రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాలలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మొదటి ఫలితం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) లతో కలిసి కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసింది. కాగా.. అధికార బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(AJSU)తో జట్టు కట్టింది.
కాగా.. జార్ఖండ్ చరిత్రలో ఏ సీఎం కూడా రెండోసారి గెలిచి సీఎం కాలేదు. జార్ఖండ్ ఓటర్లు ఒక సీఎంకు మరోసారి ఆ పదవిని కట్టబెట్టలేదు. జార్ఖండ్ మాజీ సీఎంలు ఎవరూ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. ప్రస్తుత ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘుబర్ దాస్ గెలిచి ఈ రికార్డును క్రియేట్ చేస్తారేమో చూడాలి.
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన 19 సంవత్సరాలలో ఏ సీఎం కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రఘుబర్ దాస్‌కు ఇది ఒక సవాల్‌గా మారింది. 2014 జార్ఖండ్ ఎన్నికల్లో జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన రఘుబర్ దాస్ దాదాపు 70,000 ఓట్ల తేడాతో ఆ సీటును గెలుచుకున్నారు. రఘుబర్ దాస్ 1995 నుండి జంషెడ్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఇప్పటివరకు ఓడిపోలేదు.