ప్రజలే నా బలం, బలగం : రఘునందన్ రావు

వెలుగు తొగుట, (దౌల్తాబాద్): దుబ్బాక ప్రజలే నాబలం, బలగం అని, యువకులకు కొలువులు కావాలో క్వాటర్ సీసాలు కావాలో తేల్చుకోవాలని ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండలంలోని గోవిందాపూర్, గువ్వలేగి, ఉప్పరపల్లి, కొనాయిపల్లి, తొగుట మండలంలోని ఘనపూర్, కన్గల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడన్నారు. బీసీలకు, దళితులకు పెద్దపీట వేస్తున్నా ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఎంపీగా పదేండ్లు ఉన్న ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

త్వరలోనే కన్గల్ గ్రామ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి చేసింది బీజేపీ అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్​సర్కార్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమావేశాల్లో దుబ్బాక నియోజక వర్గ అభివృద్ధి కోసం తన గొంతు వినిపించానని చెప్పారు. 

మల్లన్న సాగర్ అదనపు టీఎంసీలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజక వర్గంలో బీజేపీ బలపడుతుందని ఓర్వలేక కత్తుల పంచాయతీ తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. కేవలం వారి కార్యకర్తల కోసమే బీసీ, దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారని ఆరోపించారు. తొగుట మండలంలో అందరు అధికార పార్టీ నాయకులే కదా మండలాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు రాక కాంట్రాక్టర్లు  చనిపోయారన్నారు. రఘునందన్ గెలువక ముందు రోడ్లు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలన్నారు. డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రం, కిషన్, విభీషణ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చైతన్య, బుచ్చిరాజు, సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు.

ALSO READ : సర్పంచ్​లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సఫాట్​ శంకర్