
దుబ్బాక, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలు బీజేపీకి ఓటేయ్యాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ఆధ్వర్యంలో బుధవారం దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఎన్నికల యుద్ధం జరుగుతుందన్నారు. బీసీ సీఎం కావాలంటే బీసీలు, ఎస్సీ వర్గీకరణ కావాలంటే ఎస్సీలు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించాలని కోరారు. దుబ్బాకలో రఘునందన్‌రావు గెలిస్తే ధర్మం, న్యాయం గెలిచినట్టేనని అన్నారు.
కేటీఆర్ , హరీశ్ దుబ్బాకలో ఎగిరెగిరి పడ్డారు
కేటీఆర్ మాట్లాడుతున్న భాషను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, బూతులు తమ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. 2020 జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్‌రావు ఎగిరెగిరి పడ్డ విషయం గుర్తు చేసుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. దుబ్బాకలోని పోచమ్మ తల్లి చాలా పవర్ పుల్ అని, పొట్టోని నెత్తిని పోడువుటోడు కొడితే పోడువుటోని నెత్తిని పోచమ్మ కొట్టుడు ఖాయమన్నారు.