నల్లగొండ : తాను చిటికెస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో దాచుకుంటాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నల్లగొండ పాత బస్తీలో బీజేపీ భరోసా యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తన పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసిండని ఆరోపించారు. నల్లగొండలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడం సంగతేమోగానీ, కోటి మందిని తాగుబోతులను చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని రఘునందన్ విమర్శించారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు మోడీ అవసరం లేదని, బీజేపీ కార్యకర్త చాలని అన్నారు.
సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ మాదిరిగా నల్లగొండను అభివృద్ధి చేస్తానన్న కేటీఆర్ ఏ మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదని రఘునందన్ ప్రశ్నించారు. నల్లగొండలో నాలుగు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఎస్కార్ట్ లేకుండా బయట తిరిగే దమ్ముందా అని రఘునందన్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత తనకు తాను సీఎం కేసీఆర్ కన్నా ఎక్కువని భావిస్తుందని మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చిన కవిత తెలంగాణ ప్రజలకు బతుకమ్మ ఆడనేర్పిందా అని ప్రశ్నించారు. ఎంపీగా ఓడిన కూతురు కవిత బాధ చూసి తట్టుకోలేక కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేసిండని అన్నారు.