సీఎం కేసీఆర్ దొంగలను వెంట బెట్టుకుని తిరుగుతున్నడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఆయన ప్రార్థనలు చేస్తున్నాడని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీ క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ రోజు కూడా ఎమ్మెల్యేలతో హెలికాప్టర్లో తిరిగిన సందర్భంలేదని గుర్తు చేశారు. నిన్న జరిగిన సభలో కేసీఆర్ అన్ని అబద్దాలు చెప్పాడని రఘునందన్ ఆరోపించారు.
నలుగురు ఎమ్మెల్యేలు కడిగిన ముత్యం అయితే ఫాం హౌస్లో ఎందుకు బంధించారని రఘునందన్ ప్రశ్నించారు. పసలేని ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి వంగి వంది దండాలు పెడుతున్నాడని అన్నారు. సొంతపార్టీతో పాటు పక్క పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు వినడం కేసీఆర్, కేటీఆర్ లకు అలవాటుగా మారిందని విమర్శించారు. సుశీ ఇన్ఫ్రా కంపెనీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధంలేదన్న విషయం ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పారు. సుశీ ఇన్ఫ్రా బ్యాంక్ డీటైల్స్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్, కేటీఆర్పై కేసు పెట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవడం అంత నిజమని ధీమా వ్యక్తంచేశారు.