ఐటీ దాడులపై రాజకీయం చేయాలనుకోవడం సరికాదు : రఘునందన్

ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్న ఆయన.. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని అన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. 

మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని అన్నారు.